- టిటిడితో ఆప్కో ఒప్పందం
- రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : త్వరలో ‘నేతన్న భరోసా’ పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్, సవిత ప్రకటించారు. మంగళగిరిలోని ఆప్కో తోటలో ఆ సంస్థ స్వర్ణోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సవిత జ్యోతి ప్రజల్వన చేసి మాట్లాడారు. అన్న ఎన్ టిఆర్ జనతా వస్త్రాల పేరుతో చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించారన్నారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సిఎం చంద్రబాబు.. నేతన్నల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూనే, ఎపి చేనేత రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారన్నారు. ఆప్కోలో చేపట్టిన డిజిటలైజేషన్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించిందన్నారు. ఆప్కోను లాభాల పట్టేలా ప్రక్షాళన చేపట్టామన్నారు. నేటితరం అభిరుచులను దృష్టిలో పెట్టుకుని, చేనేత రెడీమెడీ వస్త్రాలను అమ్మకాలు చేస్తున్నామన్నామని తెలిపారు. ఇందుకు అవసరమైన శిక్షణను నేతన్నలకు అందజేస్తున్నామన్నారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా మాట్లాడుతూ, ఆప్కో బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రెడీమేడ్ వస్త్రాల తయారీపై చేనేతలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 15న సంక్షేమ హాస్టళ్లకు అందజేసిన దుప్పట్లు, ఇతర వస్త్రాలకు చెందిన రూ.4 కోట్ల బకాయిలను చెల్లించనున్నామని మంత్రి చెప్పారు. నెల మొదటివారంలో సాధారణ చేనేత ఉత్పత్తులకు రూ.2.50 కోట్లను చెల్లించనున్నట్లు తెలిపారు. ఆప్కో చరిత్రలో మొట్టమొదటిసారిగా టిటిడితో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన చేనేత సహకార సంఘాలు ముందుకొస్తే...టిటిడికి అవసరమైన దుశ్శాలువాలు, చీరలు, జాకెట్లు, కండువాలు పంపిణీ చేసే ఆర్డర్ ఇస్తామన్నారు. అనంతరం రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత సహకార సంఘాల ప్రతినిధులను మంత్రి సవిత సత్కరించారు. ఆప్కోలో పనిచేసే పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రూ.1.20 లక్షల విలువ చేసే బెనిఫిట్స్ ను చెక్ రూపంలో మంత్రి సవిత అందించారు. ఈ కార్యక్రమంలో ఆప్కో ప్రతినిధులు, పలు కార్పొరేషన్ చైర్మన్లు నందం అబద్ధయ్య, పేరేపి ఈశ్వర్, ఆకాశపు స్వామి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు ధనుంజయ రావు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)