శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విశాఖలో ‘నిర్మల్ సాగర్’ పైలట్ దశ ప్రారంభం

6 రోజుల క్రితం

sea
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 12:32 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- సముద్ర ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు శాస్త్రీయ సాంకేతికత

ప్రజాశక్తి -ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల కాలుష్యాన్ని నియంత్రించేందుకు ‘నిర్మల్ సాగర్’ కార్యక్రమం పైలట్ దశ విశాఖపట్నంలో శనివారం ప్రారంభమైంది. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖకు చెందిన ఐఎన్‌ఎస్‌ఒఐఎస్ (ఇంకోస్), ఆంధ్ర విశ్వవిద్యాలయం, విజ్ఞాన భారతి (విభ) సంయుక్త ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ సాగర్– సురక్షిత సాగర్ 5.0’ వారోత్సవాల ముగింపు సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ టి శ్రీనివాస కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మల్‌ ‌సాగర్‌ ‌ద్వారా సముద్ర వ్యర్థాల మూలాలను గుర్తించడం, వాటి కదలికను పర్యవేక్షించడం, వ్యర్థాలు పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించేందుకు ఓషన్ మోడలింగ్, ఉపగ్రహ రిమోట్ సెన్సింగ్, ఎఐ, మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలను వినియోగించనున్నామని వివరించారు. అనంతరం వ్యర్థాల తొలగింపు, రీసైక్లింగ్‌కు వ్యూహాలను రూపొందించనున్నామని పేర్కొన్నారు. ఇంకోస్ డైరెక్టర్ డాక్టర్ టిఎం బాలకృష్ణన్ నాయర్ మాట్లాడుతూ సముద్ర వ్యర్థాల హాట్‌స్పాట్లను గుర్తించి శాస్త్రీయ ఆధారాలతో నివారణ చర్యలకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఎంపి శ్రీభరత్ మాట్లాడుతూ బహిరంగ కాలువల ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరకుండా కేంద్రం సాంకేతిక, లాజిస్టికల్ సహకారం అందించాలని కోరారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జిపి రాజశేఖర్, నౌకాదళం, కోస్ట్‌గార్డ్, కేంద్ర భూ విజ్ఞాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 1,300 మందికిపైగా హాజరయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్