- తక్షణం అందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు విడుదల చేయాలి: సిపిఎం డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వెలిగొండ ప్రాజక్టు నిర్వాసితులందరికీ పూర్తిస్థాయి పునరావాసం కల్పించి నీటిని విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులు 2026 ఆగస్టుకి పూర్తిచేసి సెప్టెంబర్ 1వ తేదీన ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమే అయినప్పటికీ గతంలో ఇలాంటి గడువులు చాలా పెట్టి అమలు చేయకుండా ఆలస్యం చేశారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికీ ప్రాజెక్ట్‌కు సంబంధించి చాలా పనులు అసంపూర్తిగా ఉన్నాయన్న వాస్తవాన్ని గుర్తించాలని సూచించారు. కృష్ణా జలాశయంలో నీళ్ళులేవని, వరదలొస్తే తప్ప నల్లమల సాగర్‌కు నీళ్ళివ్వలేరని వెల్లడించారు. రిజర్వాయర్‌కు నీళ్లు వదిలినా పంటకాల్వలు లేవని, ఈ పరిస్థితులను మరిచినీళ్ళు వదలాలనుకోవడం వివేకంకాదని హితవు పలికారు. ఏదో సాధించామని గొప్పలు చెప్పుకోడానికి నిర్వాసితులను బలిచేయొద్దని ప్రభుత్వానికి సూచించారు. నిర్వాసితుల పట్ల ప్రభుత్వం నిర్ధాక్షణ్యంగా వ్యవహరిస్తోందన్నారు. నిర్వాసితులందరికీ ఇళ్ళస్థలాలు ఇవ్వకుండా, చెల్లించాల్సిన ప్యాకేజీ చెల్లించకుండానే ఆగస్టు నెలాఖరుకు గ్రామాలు ఖాళీ చేయాలన్న కలెక్టర్ మౌఖిక ఆదేశాలతో నిర్వాసితులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం రూ.906 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు మూడోవంతు అంటే రూ.306 కోట్లే చెల్లించారని, మిగతా పరిహారం ఇస్తామంటూ ఊరిస్తూ కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ నాయకులు, బాధిత ప్రజలు పరిహారం చెల్లించాలని కలెక్టర్‌ని కోరినా ముందు ఖాళీ చేయండి, సమయం లేదంటూ.. ఎక్కడైనా పరదాలు కట్టుకుని వెళ్ళాల్సిందే నంటూ గ్రామాలు ఖాళీ చేయాలని బలవంత పెడుతున్నారని వెల్లడించారు. విద్యుత్ సరఫరాను సైతం నిలిపివేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నదని తెలిపారు. అప్పటికి గ్రామాలు ఖాళీ చేయకపోతే క్రిమినల్ కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని, ఇది చట్టవిరుద్ధమే కాదు.. అమానవీయమని వెల్లడించారు. భూసేకరణ చట్టాన్ని అనుసరించి అందరికీ పరిహారం చెల్లించిన అనంతరం కనీసంగా 6 నెలలు చట్ట ప్రకారం సమయం ఇవ్వాలని, బలవంతంగా ఖాళీ చేయించకూడదని సిపిఎం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 11 గ్రామాలలోని 6,914 మందిలో కొద్ది మందికి వివిధ చోట్ల ఆర్ అండ్ ఆర్ కాలనీల కోసమంటూ ఒక్కొక్క కుటుంబానికి ఐదు సెంట్ల చొప్పున ఇంటి స్థలం కేటాయించారని, ఇప్పటికీ మార్కాపురం మండలంలోని గొట్టిపడియ గ్రామానికి, పెద్దారవీడు మండలంలోని గుండంచర్ల గ్రామంలోని నిర్వాసితులకు ఇంటి స్థలాలు చూపించలేదన్నారు. మరో 13 ఎకరాల భూసేకరణ రైతులకు ధర చెల్లించనందున ఈ ప్రక్రియ పూర్తి కాలేదని, ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించనందున ఇంటి స్థలాలు పొందినవారు ఇళ్ళు నిర్మాణం చేసుకోలేకపోయారని తెలిపారు. గతంలో ప్రకటించిన 3,901 కుటుంబాలతో పాటు 2019 ఆగస్టు 31వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులందరినీ కుటుంబంగా పరిగణించి మరో 3,013 మందిని అర్హులుగా తేల్చి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వన్‌టైం సెటిల్మెంట్ చెల్లించుటకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. కానీ ఇంకా 4,464 కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించలేదని, 18 ఏళ్లు నిండినవారు మరో 1,500 మందిని కలిపి లెక్కించి నష్టపరిహారం చెల్లించాల్సిఉందన్నారు. మరోవైపు పెళ్లయిన యువతులకు మొండిచెయ్యి చూపిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఇంతవరకు వాటికి సమాధానం చెప్పకుండా దాటవేస్తూ వచ్చిందని, ప్రభుత్వం ప్రకటించినట్లుగా 2019 చివరి నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాలేదు, నిర్వాసితులకు పరిహారం చెల్లించనూలేదు. కావున గడువు పొడిగింపు దృష్ట్యా 2026 జూలై వరకు కట్‌ఆఫ్ తేదీగా ప్రకటించి వెంటనే పునరావాస ప్యాకేజీ పూర్తిగా అందించిన అనంతరమే ప్రాజెక్టుకు నీళ్లు వదలాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.







కామెంట్‌లు (0)