ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కరువు తీవ్రం
వైసిపి అధినేత జగన్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఉన్నది ‘ఎల్‌నినో’ ఎఫెక్ట్ కాదని ‘ఎల్లో నినో ఎఫెక్ట్’ అని మాజీ ముఖ్యమంత్రి వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై పార్టీ నాయకత్వంతో గురువారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వల్ల వచ్చిన కరువు ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్రమైందని తెలిపారు. రాష్ట్రంలో 688 మండలాలకు గాను 628 మండలాల్లో కరువు ఉందని, తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు సుమారు 332 మండలాల్లో కనిపిస్తున్నాయని చెప్పారు. 28 జిల్లాల్లో వర్షపాతం లోటులోనే ఉందన్నారు. అన్నమయ్య జిల్లాలో 75 శాతం, సత్యసాయి జిల్లాలో 66 శాతం, ప్రకాశం జిల్లాలో 65 శాతం, చిత్తూరు జిల్లాలో 58.5 శాతం, వైఎస్సార్ కడప జిల్లాలో 57 శాతం, తూర్పు గోదావరి జిల్లాలో 57 శాతం, మార్కాపురం జిల్లాలో 56 శాతం, నంద్యాల జిల్లాలో 56 శాతం, విశాఖపట్నం జిల్లాలోనూ 54 శాతం, అనంతపురం జిల్లాలో 51 శాతం, కర్నూల్ జిల్లాలో 50 శాతం పైచిలుకు తీవ్రమైన వర్షపాత లోటు ఉందని అన్నారు. 56.4 లక్షల ఎకరాల్లో సాగు అయిన పంట కూడా దెబ్బతింటోందని తెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్లో నీటిమట్టం 862 అడుగులకు పడిపోయిందన్నారు. రాయలసీమలో అన్ని రిజర్వాయర్లు కూడా డెడ్ స్టోరేజీకి దగ్గర్లోకి చేరాయని అన్నారు. ప్రభుత్వ మాటలు నమ్మి సాగులోకి దిగిన రైతులు ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం తీరుతో రైతులకు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయని, ఉచిత పంటల బీమా రక్షణ లేకుండా పోయిందని, శ్రీశైలం నుంచి రాయలసీమకు సకాలంలో నీళ్లు ఇవ్వలేదని అన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వదిలేశారని, పులిచింతల ఎగువ, దిగువన తెలంగాణలో అనధికారికంగా లిఫ్ట్ పెట్టారని, అయినా చంద్రబాబు నోరు మెదపడం లేదని విమర్శించారు. పోలవరం ఎత్తులోనూ రాజీ పడ్డారని, తద్వారా రాష్ట్రానికి నష్టం జరుగుతోందన్నారు. రావాల్సిన నీటి నిల్వను వదులుకుంటున్నారని, గతంలోనే ఉన్న పుష్కర, పురుషోత్తపట్నం లిఫ్టులను ఆపరేట్ చేసి తానే నీళ్లు తెచ్చినట్టుగా టిడిపి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని అన్నారు. జూన్, జూలై, ఆగస్టు వరుసగా వర్షపాతం లోటు స్పష్టంగా కనిపిస్తున్నా ప్రభుత్వంలో స్పందన లేదన్నారు.
కరువు మండలాలను ప్రకటించాలి
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే కరవు మండలాలు ప్రకటించాలని జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. రైతులకు ఉచిత పంటల బీమాను వెంటనే పునరుద్ధరించాలని, రైతుల నుంచి వసూలు చేసిన ప్రీమియంను రైతులకు ఇవ్వాలని కోరారు. గతంలో ఎగ్గొట్టిన రూ.3 వేల కోట్ల పంటల బీమా పరిహారాన్ని కూడా వెంటనే ఇవ్వాలని అన్నారు.
రైతులకు మద్దతుగా నిలబడతాం
రైతులకు మద్దతుగా లోతైన అధ్యయనం చేస్తామని, వారి సమస్యల పరిష్కారానికి తగిన కార్యాచరణ రూపొందిస్తామని జగన్ అన్నారు. సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామన్నారు. ఈ సమావేశంలో వైసిపి రీజినల్ కోఆర్డినేటర్లు వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, గుడివాడ అమర్‌నాథ్, స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ వ్యవసాయ విభాగం ప్రధాన కార్యదర్శి ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎంపిలు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)