గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమంచినీటి నిల్వలు తగ్గిపోతాయి !

52 నిమిషాల క్రితం

sun.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 12:29 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • హిమనీ నదాలు కరిగిపోతాయి

  • హెచ్చరించిన డబ్ల్యుఎంఓ నివేదిక

  • అత్యంత పొడి సంవత్సరంగా 2025

జెనీవా : ప్రపంచవ్యాప్తంగా వున్న నదులు గత మూడు దశాబ్దాలకు పైగా కాలంలో ఎన్నడూ లేని విధంగా 2025లో అత్యంత పొడి సంవత్సరాన్ని చవిచూశాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యుఎంఓ) గురువారం పేర్కొంది. దీర్ఘకాలం పాటు మంచినీటి నిల్వల క్షీణత కొనసాగే అవకాశం వుందని, అలాగే హిమనీ నదాలు కరిగిపోయే ప్రమాదముందని డబ్ల్యుఎంఓ నివేదిక హెచ్చరించింది. ఈ ధోరణులతో భూగోళం భవిష్యత్‌కు, ప్రజలు, దేశాల ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర పర్యవసానాలు వాటిల్లే అవకాశం వుందని పేర్కొంది.

వాటర్‌ ‌సైకిల్‌ (‌జలచక్రం) మరింత అస్తవ్యస్థంగా, అనూహ్యంగా మారుతోందని, అతి తక్కువ, అతి ఎక్కువ స్థాయిల మధ్య ఊగిసలాడుతోందని పేర్కొంది. అంతర్జాతీయ జలవనరుల స్థితిగతులు పేరుతో డబ్ల్యుఎంఓ ఈ నివేదికను వెలువరించింది. 1991 నుండి చూసినట్లైతే గత ఏడేళ్ళ కాలంలో సాధారణ ప్రవాహాలను కలిగిన నదులు అతి కొద్ది సంఖ్యలో మాత్రమే వున్నాయని పేర్కొంది. వరుసగా ఏడవ ఏడాది కూడా సాధారణ పరిస్థితులు వున్న నదీ పరీవాహక ప్రాంతాల సంఖ్య చాలా తక్కువగా వున్నాయి. 1991-2020 మధ్య కాలంలో ఇవి సగటున 46శాతంగా వుండగా, ప్రస్తుతం 34 నుండి 38శాతం మధ్య వున్నాయని నివేదిక పేర్కొంది.

భూతల నీటి నిల్వలు - అంటే భూగర్భ జలాలు, చెరువులు, నదులు, నేలలోని తేమ, వృక్ష సంపద, మంచు, హిమం రూపంలో నిల్వ వుండే నీటి పరిమాణం -2010 మధ్య కాలం నుండి క్షీణిస్తూ వస్తున్నాయి. డబ్ల్యుఎంఓ సెక్రటరీ జనరల్‌ ‌సెలెస్టె సాలో మాట్లాడుతూ, భూమి యొక్క నీటి నిల్వలనేవి అప్పుడప్పుడు వచ్చే జల సంక్షోభాలను తట్టుకునే ‘పొదుపు ఖాతాల’ వంటివని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ పొదుపు ఖాతాకి ఏం జరుగుతోందన్నది 2025 నివేదిక ప్రధానంగా పేర్కొంటోందని అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం పూర్తిగా దాన్ని క్షీణింపచేస్తున్నామని ఆమె జెనీవాలో నివేదికను ఆవిష్కరిస్తూ జర్నలిస్టులతో వ్యాఖ్యానించారు. సెంట్రల్‌ ఆసియా, ఐస్‌‌ల్యాండ్‌, రష్యన్‌ ఆర్కిటిక్‌, పశ్చిమ కెనడా, అమెరికా ఇలా ప్రపంచవ్యాప్తంగా వున్న 19 హిమనీ నదాలు కరిగిపోతున్నాయి. ఇప్పటికే మూడు అత్యంత అధ్వాన్న సంవత్సరాలను నమోదు చేసుకున్నాయని డబ్ల్యుఎంఓ ‌జల శాస్ర్ర విభాగ డైరెక్టర్‌ జెన్‌‌కిన్సన్‌ ‌పేర్కొన్నారు. గత ఐదేళ్ళుగా ప్రతీ ఏడాదీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట రికార్డు స్థాయిలో వరదలు, కరువులు సంభవిస్తూనే వున్నాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఒకదానికి మరోదానికి మధ్య కోలుకునే సమయం కూడా వుండడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2023-2025 మధ్య మొత్తంగా 1400 గిగాటన్నుల మంచు కరిగిపోయింది. ఇది దాదాపుగా వార్షిక మంచినీటి వినియోగంలో మూడో వంతుతో సమానం. ‘నీటికి సరిహద్దులు వుండవు, ఒక నదీ పరీవాహక ప్రాంతంలో నీటి సంతులత మరో దేశంలో ఏం జరిగిందనేదానిపై ఆధారపడుతుంది. ఒక దేశంలో హిమనీ నదం కరిగిపోవడమంటే వందలాది కిలోమీటర్ల దిగువున గల జనాభా నీటి లభ్యత స్వరూపం పూర్తిగా మారిపోతుంది. అందుకే మనం డేటాను, ప్రమాణాలను, ముందస్తు హెచ్చరికలను ఇలా ప్రతీదాన్ని పంచుకోవడం అత్యంత అవసరం. డబ్ల్యుఎంఓ కచ్చితంగా పనిచేసేది అదే కర్తవ్యంపైన.’’ అని సాలో పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్