గుంటూరు కలెక్టరేట్ వద్ద మహాధర్నాలో వక్తలు డిమాండ్
అగ్రకులాలు వారు హత్యకు గురైతేనే స్పందిస్తారా?
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా : చీకటి గోపి హత్యపై న్యాయవిచారణ జరిపించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అగ్రకులాల వారు హత్యకు గురైతేనే ప్రభుత్వం స్పందిస్తుందా? అని ప్రశ్నించారు. తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామ దళిత యువకుడు చీకటి గోపి (30) లాకప్ డెత్ కు కారణమైన తాడికొండ పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత, గిరిజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట గురువారం పెద్ద ఎత్తున మహాధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల తాడికొండ పోలీస్ స్టేషన్ లో చీకటి గోపి అనే దళిత యువకుడ్ని దొంగతనం నెపంతో పోలీసులు చిత్రహింసల గురి చేశారని, ఈ కేసులో ఇప్పటివరకు పోలీస్ అధికారులు, హోం మంత్రి, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దారుణ మన్నారు. పోలీసుల చేతిలో యువకుడు హత్యకు గురైతే సాదాసీదా మరణం కింద చూపడం తగదని, జ్వరంతో చనిపోయాడని తప్పుదోవ పట్టించే విధంగా డిఎస్‌పి ప్రకటనలు ఇస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే న్యాయవిచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్‌కు గురైతే ఆగమేఘాల మీద స్పందించిన ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఇద్దరు దళిత యువకులు హత్యకు గురైనా పట్టించుకోలేదని, కనీసం హోం మంత్రి స్పందించలేదన్నారు. దళితులు హత్యకు గురైతే ఒక విధంగా, అగ్రకులాల విషయంలో మరో విధంగా స్పందించడం తగదన్నారు. నిందితులపై ఎస్‌సి, ఎస్‌సి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గోపి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని తెలిపారు. ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి, లక్ష్మణ నాయుడు హత్య గురైతే ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించిందని గుర్తుచేశారు. ఈ రెండు ఘటనల్లో హోం మంత్రి అనిత, రాష్ట్ర మంత్రులు వేగంగా స్పందించి హత్యకు గురైన వారి కుటుంబాలకు భారీ ఎక్స్ గ్రేషియా అందించారన్నారు. వ్యక్తిగత వివాదాల వల్ల అగ్రకులాల వారు హత్యకు గురైనా వేగంగా స్పందిస్తున్న కూటమి ప్రభుత్వం దళితులు హత్య గురైతే ఏ మాత్రమూ స్పందించడం లేదని విమర్శించారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో 25 మంది దళితులు హత్యకు గురయ్యారని, ఒక్క ఘటనలో కూడా ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్ల ఒంగోలులో వీరయ్య చౌదరి హత్యకు గురైతే కూడా ప్రభుత్వం వేగంగా స్పందించిందని గుర్తు చేశారు. ఈ స్పందన దళితులు విషయంలో రావడం లేదన్నారు. చీకటి గోపి హత్య విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఒకవైపు న్యాయపరంగా పోరాడుతూనే మరోవైపు సామాజిక ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. సంబంధిత పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఉద్యమం ఆగదని తెలిపారు. గోపి కుటుంబసభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మహాధర్నాకు అధ్యక్షత వహించిన కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ చీకటి గోపిని మూడు రోజులపాటు నిర్బంధించి తాడికొండ పోలీసులు తీవ్రంగా కొట్టారని విమర్శించారు. విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు యన్.జె విద్యాసాగర్ మాట్లాడుతూ దళితులపై ప్రభుత్వ వివక్ష కొనసాగుతోందన్నారు. వైసిపి నాయకులు వనమా బాల వజ్రబాబు మాట్లాడుతూ గోపి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మాల్యాద్రి మాట్లాడుతూ చీకటి గోపి మరణానికి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వై సుధీర్ బాబు మాట్లాడుతూ దళితులపై దాడులు చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుడు చీకటి గోపి భార్య జ్యోతి, దళిత బహుజన ఫ్రంట్ నాయకులు కొరివి వినయ్ కుమార్, ఎంఆర్‌పిఎస్ జాతీయ అధ్యక్షులు నాగరాజు, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి జె.నవీన్ ప్రకాష్, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎంఎ చిష్టి తదితరులు ప్రసంగించారు.
కలెక్టర్‌కు వినతి
మహాధర్నా అనంతరం గుంటూరు జిల్లా కలెక్టర్‌ను కలిసి నాయకులు వినతిపత్రం అందించారు. చీకటి గోపి కుటుంబానికి న్యాయం చేయాలని, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సిఐ ఉమేష్ పైనా, ఆయన సిబ్బందిపైనా హత్యా నేరం, కస్టోడియల్ టార్చర్, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని, జ్యుడీషియల్ దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, సమగ్ర విచారణ చేపట్టి గోపి కుటుంబానికి న్యాయం చేస్తామని, ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా అదనపు ఎస్‌పి రమణమూర్తికి కూడా ఈ మేరకు వినతిపత్రం అందించారు.







కామెంట్‌లు (0)