గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionయుపిఐ ఛార్జీలపై సర్వత్రా ఆగ్రహం

53 నిమిషాల క్రితం

upi.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 12:10 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న కేంద్రం

  • ట్రంప్ ప్రయోజనాల కోసమేనన్న ప్రతిపక్షాలు

  • చిరు వ్యాపారులు, యూజర్లలో ఆందోళన

  • అక్టోబర్ 15 నుంచే వడ్డన

న్యూఢిల్లీ: యుపిఐ ఛార్జీల మోతపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయంపై వ్యాపారులు, దుకాణదారులు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీన్ని ‘మోడీ టాక్స్’గా వారు అభివర్ణిస్తున్నారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్‌సహా పలు ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. అయినా, యుపిఐ ద్వారా రెండు వేలకు మించిన లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్) విధించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వ శ్రేణులు బుధవారం స్పష్టం చేశాయి. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ ఛార్జీలపై పునరాలోచన చేస్తారా అని ప్రశ్నించగా, ఇది ఇప్పటికే తీసుకున్న నిర్ణయమని, దీన్ని రద్దు చేసే ప్రశ్నే లేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు. దీని ద్వారా వ్యవస్థ భద్రత, సురక్షితతను బలోపేతం చేయడంతోపాటు, విస్తృత ప్రయోజనాల దృష్ట్యానే ఈ ఛార్జీలు విధిస్తున్నామని ప్రభుత్వం సమర్ధించుకుంది. 2020లో యుపిఐ వ్యవస్థను ప్రవేశపెట్టిన సమయంలోనే ఛార్జీలు విధించే యోచన ఉందని, కొత్త ఎండిఆర్ విధానం యుపిఐని స్వావలంబన దిశగా తీసుకెళ్తుందంటూ ప్రభుత్వ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.

​​అమలు చేస్తే నష్టమే...

ఎండిఆర్ అనేది వ్యాపారుల చెల్లించే పన్ను అని, వినియోగదారులపై ఎలాంటి భారం పడదంటూ కేంద్ర సర్కార్ చెబుతుంది. అయితే, వ్యాపారులపై పన్ను వేస్తే వారు తమ జేబులోంచి కడతారా? తిరిగి వినియోగదారులపైనే ఆ భారం వేస్తారని యూజర్లు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. ఇది పన్ను కాదంటూ కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన స్పష్టతను లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. దీనిని ముమ్మాటికీ ‘యుపిఐ పన్నే’ అని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి ప్రధాని లొంగిపోయారని, అమెరికన్ మల్టీ నేషనల్‌‌‌‌ కంపెనీల జేబులు నింపేందుకే స్వదేశీ డిజిటల్ వ్యవస్థను బలహీనపరుస్తున్నారని రాహుల్‌ ‌విమర్శించారు. దీన్ని అమలు చేస్తే భారత ఆర్ధిక వ్యవస్థ తివ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు. కేంద్రం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

​చర్చా లేదు.. ఆమోదం అంతకన్నాలేదు : కాంగ్రెస్‌

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో యుపిఐ ఛార్జీల విధింపు నిర్ణయాన్ని కాంగ్రెస్‌ ఆమోదించదని బిజెపి పేర్కొంది. దీంతో రాజకీయ దుమారం రేగింది. ఈ నిర్దిష్ట ప్రతిపాదనను కమిటీ ముందు ఉంచనూలేదని, ఆమోదించనూ లేదని కాంగ్రెస్ పార్టీ గురువారం తీవ్రంగా తోసిపుచ్చింది. యుపిఐ పన్ను నిర్ణయంపై వెల్లువెత్తిన వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ విమర్శించారు. అమెరికా కంపెనీలను, డొనాల్డ్ ట్రంప్‌ను సంతృప్తిపరిచేందుకే ఈ యుపిఐ పన్ను నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గోప్యంగా ఉండాల్సిన పార్లమెంటరీ కమిటీల చర్చలను ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం దురదృష్టకరమని కాంగ్రెస్ ఎంపి మనీష్ తివారీ అన్నారు. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఎండిఆర్ కు సంబంధించి రేటు, పరిమాణం, రుసుము, పరిమితులు, మినహాయింపు స్లాబ్‌లతో సహా ఏ నిర్దిష్ట ప్రతిపాదననూ కమిటీ ముందు ఉంచలేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే చిరువ్యాపారులు యుపిఐ లావాదేవీలను నిరాకరిస్తున్నారు. దీంతో మళ్లీ పెద్ద ఎత్తున నగదు అవసరం పడుతుందని, ఆర్థిక వ్యవస్థపై భారం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్