- ఎస్ఆర్ ల డిజిటలైజేషన్
- ఉద్యోగుల భౌతిక రికార్డులు రద్దు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డులను ఇకపై పూర్తిగా డిజిటలైజేషన్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు భౌతికంగా ఉన్న రికార్డుల వ్యవస్థను ఇకపై రద్దు చేయనున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే ఇ-ఎస్ ఆర్ వ్యవస్థను ప్రవేశపెట్టినప్పటికీ, కోవిడ్ మహమ్మారి, ఇతర పరిపాలనా కారణాల వల్ల అన్ని శాఖల్లో ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. అప్పటివరకు నమోదైన వివరాలను భద్రపరిచి, వాటినే ఆధారంగా తీసుకుని ఇప్పుడు ఇ -ఎస్ ఆర్ 2.0ను ఆధునికంగా అభివృద్ధి చేశారు. ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా పెన్షన్ ప్రతిపాదనలను పూర్తిగా ఆన్‌లైన్‌లో ప్రాసెస్ చేస్తోంది. తాజా నిర్ణయంవల్ల ఉద్యోగి సేవా వివరాల నుంచి పెన్షన్ మంజూరు వరకు మొత్తం ప్రక్రియ డిజిటల్‌గా సాగనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఎలక్ట్రానిక్ హ్యూమన్ రిసోర్స్ మాస్టర్ (ఇహెచ్ఆర్ఎం) వ్యవస్థతో ఇ-ఎస్ఆర్ ను అనుసం ధానించింది. దీంతో ఉద్యోగుల పోస్టులు, సేవా వివ రాలు, పదోన్నతులు, బదిలీలు, వేతన మార్పులు వంటి సమాచారం ఒకే డిజిటల్ వేదికపై అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో పేరోల్ వ్యవస్థ కూడా నేరుగా ఇ-ఎస్ ఆర్ ఆధారంగానే పనిచేస్తుంది.
ఒకే డేటా ఆధారంగా హెచ్‌ఆర్, పేరోల్
ఇప్పటివరకు సర్వీస్ రిజిస్టర్, పేరోల్ వేర్వేరుగా నిర్వహించేవారు. వార్షిక ఇంక్రిమెంట్లు, పే ఫిక్సేషన్, ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్, పదోన్నతులు, బదిలీలు, సెలవులు, వేతన సవరణలు వంటి అంశాలను విడివిడిగా నమోదు చేసేవారు. కొత్త వ్యవస్థలో ఈ వివరాలన్నీ ఇఎస్ ఆర్ నుంచే నేరుగా పేరోల్ వ్యవస్థకు చేరతాయి. తాజా నిర్ణయంతో పాత సర్వీస్ రిజిస్టర్లో ఉన్న వివరాలు మొత్తం డిజిటలైజ్ చేయాల్సి ఉంటుంది. నమోదైన సమాచారం పూర్తి, సరైనదిగా నిర్ధారించే బాధ్యత సంబంధిత ఉద్యోగి, హెచ్‌ఆర్ మేనేజర్‌పై ఉంటుంది. ఇఎస్ ఆర్ లో ఉద్యోగికి సంబంధించి ఉద్యోగి ప్రాథమిక వివరాలు, ,స్వగ్రామం, వ్యక్తిగత వివరాలు,, సేవా వివరాలు, ప్రోత్సాహకాలు, రుణాలు, అడ్వాన్సులు, సెలవుల లెడ్జర్, లీవ్ ట్రావెల్ కన్సెషన్ వివరాలు, శాఖాపరమైన పరీక్షలు, శిక్షణ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
కొత్తగా 'చెకర్' వ్యవస్థ
డేటా ఖచ్చితత్వం కోసం కొత్తగా 'చెకర్' ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఉద్యోగి తన భౌతిక సర్వీస్ రిజిస్టర్‌ను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అనంతరం సేవా వివరాలను నమోదు చేయాలి. చివరగా హెచ్‌ఆర్ మేనేజర్ లేదా అధీకృత అధికారి ఆమోదించాల్సి ఉంటుంది.








కామెంట్‌లు (0)