- సమస్యల పరిష్కారం కోసం కేటాయిస్తాం.
- డబ్బులే ఎన్నికల్లో గెలిపించవు
- సమిష్టి కృషితోనే స్థానిక సంస్థల్లో విజయం
- ‘టిడిపి’ లీడర్షిప్ కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నియోజకవర్గాల్లో చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి రూ.1కోటి చొప్పున నిధులు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలకు లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్ కార్యక్రమం టిడిపి కార్యాలయంలో సోమవారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన కోరగా ప్రభుత్వం పరంగా రూ.1కోటి అందిస్తామని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వం సమకూర్చే నిధులతో పాటు ఎంపి ల్యాండ్స్ నిధులను కూడా సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో 25 ప్రాధాన్యతాంశాలను గుర్తించి, వాటి ఆధారంగా అభివృద్ధి ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ప్రాధాన్యతా అంశాలపై లక్ష్యాలు నిర్దేశించుకుని పనిచేస్తే ప్రజల్లో గుర్తింపు, గౌరవం లభిస్తాయని అన్నారు. ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం లక్ష్యాలతో ముందుకెళ్తోందని తెలిపారు. ప్రజల్లో నిత్యం ఉంటూ, కేడర్‌తో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగేవాడినని అన్నారు. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ, నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నామని వివరించారు. ప్రతి పదేళ్లకోసారి జనరేషన్‌లో మార్పు వస్తుందని, ఆ మార్పులకు అనుగుణంగా నాయకుల పనితీరు కూడా మారాలని అన్నారు. ఈ తరానికి తగినట్టుగా వ్యవహరించినప్పుడే రాజకీయాల్లో విజయాన్ని సాధించగలమని చెప్పారు. నాయకుల నడవడికను ప్రజలు నిరంతరం గమనిస్తుంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల్లో విజయమే లక్ష్యంగా నేతలు సమిష్టిగా పనిచేయాలని ఆదేశించారు.ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలతను ఎన్నికల్లో ఓట్లుగా మారేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పారు. ఎన్నికలను తేలిగ్గా తీసుకోకుండా, కూటమి నేతలంతా సఖ్యతగా పనిచేసి 2029 ఎన్నికల్లో 2024 కంటే మెరుగైన ఫలితాలు సాధించాలని అన్నారు. డబ్బు ఒక్కటే ఎన్నికల్లో గెలిపించదని, ప్రజలు, కేడర్‌తో బలమైన అనుబంధమే విజయానికి పునాది అని పేర్కొన్నారు. కేడర్‌ను నిర్లక్ష్యం చేయకుండా వారిని ఒప్పించి, కలుపుకొని పనిచేస్తే ప్రజాప్రతినిధుల బలం వందరెట్లు పెరుగుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడంపైనే తన ధ్యాస, ఆలోచన ఉందన్నారు.ఈ నేపథ్యంలో ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకుని, ఆ తర్వాతి ఎన్నికలకు మరింత బలమైన పునాది వేసుకోవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ల ద్వారా పోటీ చేసే అభ్యర్థుల్లో సమర్థవంతమైన మహిళా నాయకులను గుర్తించాలని చెప్పారు.ఎమ్మెల్యేలు అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్‌ను తదుపరి సమావేశాల్లో ప్రదర్శించాలని సూచించారు. కేంద్ర సహకారంతో ఇచ్చిన హామీల అమలుకు అనునిత్యం పనిచేస్తున్నామని, అభివృద్ధి-సంక్షేమం-సుపరిపాలనను బ్యాలెన్స్ చేస్తూ పాలన చేపట్టామన్నారు.వైసిపి చేస్తునన తప్పుడు ప్రచారాన్ని తేలిగ్గా తీసుకోవద్దని, సామాజిక మాధ్యమాల ద్వారా నిజాలతో గట్టిగా సమాధానం ఇవ్వాలని చెప్పారు.
పొలిటికల్ గవర్నెన్సుకు ప్రాధాన్యత
పొలిటికల్ గవర్నెన్సు కు ప్రాధాన్యత ఇస్తూ పాలనలో ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు అన్నారు. కష్టకాలంలో నిలబడిన కార్యకర్తకు పూర్తి గౌరవం ఇస్తున్నామని స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో తన జన్మ ధన్యమైందన్నారు. ఎల్‌నినో విపత్తుపై అంతా అప్రమత్తంగా ఉండాలని, దీనిపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రతీ కార్యక్రమంలో ప్రజల్ని భాగస్వాములు చేయాలని తెలిపారు. జిల్లాలు నియోజకవర్గాల వారీగా విజన్ ప్లాన్ ఇచ్చామని పరిపాలనా వెసులుబాటు కోసం ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజా ప్రతినిధులు సమర్ధ నాయకత్వం వహించి, సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో బాగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తున్నామని పొలిట్ బ్యూరో, చట్ట సభల్లోకి తీసుకు వచ్చామని అన్నారు. ఫోటోలు, ఫ్లెక్సీల గురించి వివాదాలు వద్దని కూటమిగా కలిసి క్షేత్రస్థాయికి వెళ్లాలని చెప్పారు. పార్టీ కార్యకర్తల్లో చాలామంది పేదలు ఉన్నారని, వారికి వివిధ పథకాలు అందింపుచ్చుకునేలా గైడ్ చేయాలని సూచించారు. వ్యాపారాలు చేసుకుని అభివృద్ధి చెందేలా ఎమ్మెల్యేలు ప్రోత్సాహించాలని చెప్పారు. 2024 కంటే ఎక్కువ ఓట్లు వచ్చేలా పనిచేయాలని తెలిపారు. అంతకు ముందు కాన్ క్లేవ్ లో ‘సీఈఓ సీఎం టూ వాటర్ మాన్’ అంటూ ఎకనామిక్ టైమ్స్ రాసిన కథనంపై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్యమంత్రికి అభినందన తీర్మానం ప్రవేశ పెట్టగా, ఈ కథనం తనకు సంతోషంగా ఉందని చంద్రబాబు అన్నారు. జల సంరక్షణపై చేస్తున్న కష్టానికి దక్కిన గుర్తింపు అని తెలిపారు. టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే వెంకటరాజు,ఏలూరి సాంబశివరావు,గోరంట్ల బుచ్చయ్య చౌదరి,వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తదితరులు ప్రసంగించారు.








కామెంట్‌లు (0)