గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిర్మాణ కార్మికురాలి మృతికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : సిఐటియు

1 గంట క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 02:52 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ : మంగళగిరి రత్నాల చెరువు సమీపంలోని శ్రీ హేమదుర్గ డీఎన్‌ఆర్ ఐకాన్ నిర్మాణ సైట్‌లో పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 46 ఏళ్ల సరస్వతి ఐదో అంతస్తు నుంచి పడి మృతి చెందారు. మృతురాలి కుటుంబానికి తక్షణమే రూ.10 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో గురువారం ఆందోళన నిర్వహించింది. ముందుగా భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉంచిన ఎన్నారై ఆసుపత్రికి వెళ్లి సందర్శించారు. అనంతరం నిర్వహించిన ఆందోళనలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఆర్.వి. నరసింహారావు మాట్లాడుతూ.. నిర్మాణ రంగంలో కార్మికుల మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ కార్మికుల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టకపోవడం ఆందోళనకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో ప్రారంభించిన సంక్షేమ బోర్డు కార్మికులను ఆదుకునే విధంగా లేదని అన్నారు. గతంలో చంద్రన్న బీమా పేరుతో రూ.5 లక్షల వరకు సహాయం అందించేవారని, ప్రస్తుతం సంక్షేమ బోర్డు ఉన్నప్పటికీ నిర్మాణ పనుల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తగిన పరిహారం అందించే విషయంలో స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. వలస కార్మికులకు కూడా కార్మిక చట్టాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు వలస కార్మిక చట్టం ప్రకారం చెల్లించాల్సిన వేతనాలు, ఇతర హక్కులు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సకాలంలో పరిహారం అందడం లేదని అన్నారు. సుమారు 140 ప్లాట్ల నిర్మాణం చేపడుతున్న డీఎన్‌ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ కార్మికురాలు మృతి చెందిన ఘటనపై కనీసం స్పందించకపోవడం బాధాకరమన్నారు. మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. మృతురాలి కుటుంబానికి తక్షణమే రూ.10 లక్షల పరిహారం అందించాలని, కార్మికుల భద్రతకు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పరిహారం అందించకపోతే నిర్మాణ ప్రాంతంలో పనులను బంద్ చేయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి అప్పారావు, బాబురావు, జానీ భాష తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్