- ఎపి పంచాయతీ ఎన్నికల్లోనూ తలదూర్చిన వైనం
- పోటీ చేయాలనుకున్న పది మందిని అదుపులోకి తీసుకున్న కొరాపుట్ పోలీసులు
- వారిలో ఇద్దరి అరెస్టుపై అధికారిక ప్రకటన
ప్రజాశక్తి- పార్వతీపురం : వివాదాస్పద కొటియా గ్రామాల్లో ఒడిశా దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. ఎపి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా పోటీ చేయాలని భావిస్తున్న పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండల పరిధిలోని గంజాయిబద్ర, పట్టు చెన్నూరు, పగుల చెన్నూరు పంచాయతీల గిరిజన నాయకులపై ఒడిశా పోలీసులు గత రెండు రోజులుగా నిర్బంధం ప్రయోగిస్తున్నారు. మూడో విడతలో ఎన్నికలు జరుగుతున్న కొటియా గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణ శనివారం నుంచి ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో సర్పంచులుగా పోటీ చేయాలని భావిస్తున్న గంజాయిబద్ర మాజీ సర్పంచ్ గెమ్మెల భీషు, పట్టు చెన్నూరు మాజీ సర్పంచ్ చోడిపిల్లి భీషు, గిరిజన నాయకులు పూనేటి లివిరి, పేత్రూ, రాజు, డోంబు సహా పది మందిని శుక్రవారం సాయంత్రం ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కొరాపుట్ తీసుకెళ్లినట్లు వారి బంధువులు చెపుతున్నారు. వారందరినీ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు విడిచిపెట్టేది లేదని కొరాపుట్ జిల్లా అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాగా, వారిలో గెమ్మెల భీషు, పూనేటి లివిరిలను అరెస్టు చేసినట్లు ఒడిశా పోలీసులు శనివారం ప్రకటించారు.
ఈ నెల నాలుగున కొరాపుట్ జిల్లా అధికారుల విధులకు వీరిద్దరూ ఆటంకం కలిగించారంటూ బిఎన్ఎస్ చట్టం 163 ప్రకారం కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. కొటియా గ్రామాల్లో డిసెంబర్ రెండున పోలింగ్ జరగనుంది. ఎపి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని తమ వారిని ఒడిశా నిర్బంధం నుంచి విడిపించాలని కొటియా గ్రామాల గిరిజనులు కోరుతున్నారు. ఎపిలోని ప్రాదేశిక ఎన్నికల్లో కొటియా గ్రామాల గిరిజనులను ఓటింగ్లో పాల్గొనకుండా చేయడానికి కొరాపుట్ జిల్లా ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు, పోలీసులు, అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. వారిని తప్పించుకొని వెళ్లి కొటియా గ్రామాల గిరిజనులు కొందరు ఓటు వేశారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పాల్గొననీయకుండా చేసేందుకు ఒడిశా అధికారులు, పోలీసులు బెదిరింపులు, నిర్బంధం ప్రయోగిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో మూడో విడతలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సాలూరు మండల పరిధిలో కొటియా గ్రామాలు ఉన్నాయి. జిల్లాలోని 12 మండలాల్లో రెండు విడతల్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత మూడో విడతలో ఈ మూడు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు అంటున్నారు. కొటియా గ్రామాల వివాదం నేపథ్యంలో ఒడిశా అధికారులు, పోలీసులు దౌర్జన్యం చేస్తే దీటుగా ఎదుర్కొనేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు బలగాలను ఎపి ప్రభుత్వం మోహరింపజేస్తుందని చెప్తున్నారు.









కామెంట్లు (0)