వైసిపి అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకో వివాదం, వారానికో కుంభకోణం వెలుగులోకి వస్తోందని, తాజాగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం కేంద్రంగా ఆ పార్టీ కీలక నేత రుక్మిణి కోట ఆధ్వర్యాన రూ.7 కోట్ల ఉద్యోగాల కుంభకోణం బయటపడిందని వైసిపి అధికార ప్రతినిధి వై నాగార్జున యాదవ్ విమర్శించారు. ఈ కుంభకోణానికి జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ బాధ్యత వహించాలన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేయడమే కాకుండా, ఈ కేసులో దళిత మహిళ ధరణికృష్ణను పావుగా చేసి జనసేన నేతలు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శివ శ్రీనివాస్, జనసేన ఉపాధ్యక్షులు కోట రుక్మిణి తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా విచ్చలవిడిగా పెరిగిపోతున్నా కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందని వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగమల్లీశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు 100 రోజుల్లోనే డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని, రాష్ట్రంలో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు, నారా లోకేష్, హోంమంత్రి అనిత ఇప్పుడు 30 నెలల పాలనలో ఏం సాధించారని ప్రశ్నించారు. మత్తు పదార్థాలకు బానిసలైన కొందరు నేరాలకు పాల్పడుతున్న ఘటనలు సమాజాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయన్నారు.








కామెంట్‌లు (0)