అమరావతి బడా కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ చెల్లింపులు, విజయవాడ మున్సిపల్ కాంట్రాక్టర్లకు సంవత్సరాల తరబడి బకాయిలు తగదు
కాంట్రాక్టర్ల సమ్మెతో విజయవాడలో అభివృద్ధి కార్యక్రమాలు స్తంభించిపోయినా, స్పందించని మంత్రి, ప్రజా ప్రతినిధులు
విజయవాడ : విజయవాడ నగరపాలక సంస్థకు పెండింగ్ లో ఉన్న 1000 కోట్ల రూపాయల గ్రాంట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించాలని, కాంట్రాక్టర్లకు బకాయిలు ఇవ్వాలని, అమరావతితోపాటు విజయవాడ, గుంటూరు ఇతర నగరాలపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబురావు డిమాండ్ చేశారు. శుక్రవారం బాబూరావు మీడియాతో మాట్లాడుతూ .... పెండింగ్ లో ఉన్న 400 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ .... విజయవాడ నగరపాలక సంస్థ కాంట్రాక్టర్లు గత 5 రోజుల నుండి సమ్మె చేస్తున్నారని అన్నారు. సమ్మెతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, కొన్ని ప్రాంతాలలో మంచినీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ వాహనాలు ఆగిపోయాయనీ, గతము నుండి టెండర్లు వేయటానికి కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా ఇవ్వవలసిన వెయ్యి కోట్ల రూపాయల గ్రాంట్ల బకాయిలు చెల్లించటం లేదని చెప్పారు. సమ్మెతో అభివృద్ధి పనులు ఆగిపోయినా, ప్రభుత్వం, మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులలో చలనం లేదు, కనీస స్పందన కరువైందన్నారు. రాజధాని అమరావతిలో బడా కంపెనీలైన ఆ నాలుగైదు సంస్థలకు పనులు చేపట్టకముందే కొట్లాది రూపాయల అడ్వాన్సులు చెల్లించారని తెలిపారు. విజయవాడలో పనులు పూర్తయిన సంవత్సరాల తర్వాత కూడా చిన్న, మధ్య తరగతి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా కాలయాపన చేయటం అన్యాయమన్నారు. అమరావతితో పాటు విజయవాడ, గుంటూరు ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఒకవైపున చెబుతూనే.. మరోవైపు నిర్లక్ష్యం చేయటం గర్హనీయమని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని, విజయవాడ నగరపాలక సంస్థకు గ్రాంట్ల బకాయిలు చెల్లించాలని, కాంట్రాక్టర్లకు బకాయిలు ఇవ్వాలని, సమ్మెను పరిష్కరించాలని, అభివృద్ధి పనులు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)