శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విప్రోలో ఫ్రెషర్ల నిరీక్షణ..

1 గంట క్రితం

wirpro
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 11:07 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఆఫర్ లెటర్లపై అనిశ్చితి..

200 మందికి పైగా ఆందోళన

కార్మిక శాఖను ఆశ్రయించిన నైట్స్

స్పందించిన యాజమాన్యం

బెంగళూరు : ఐటి దిగ్గజం విప్రోలో ఎలైట్ హైరింగ్ 2025 ప్రక్రియ ద్వారా ఎంపికైన 200 మందికి పైగా ఫ్రెషర్లను విధుల్లోకి తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (నైట్స్) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై తక్షణమే జోక్యం చేసుకుని అభ్యర్థుల ఆన్‌బోర్డింగ్‌కు కాలపరిమితితో కూడిన షెడ్యూల్‌ను ప్రకటించేలా విప్రోను కోరాలని నైట్స్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలుజా కార్మిక శాఖకు లేఖ రాశారు.

2025 ఫిబ్రవరి 1న జరిగిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొన్న అభ్యర్థులు టెక్నికల్, వాయిస్ అసెస్‌మెంట్లలో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూ ప్రక్రియను పూర్తి చేశారు. 2025 జులైలో ఇంటర్వ్యూలు పూర్తయ్యాక జులై 22న ఆఫర్ లెటర్లు, ఆగస్టులో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ అందుకున్నారని నైట్స్ తెలిపింది. అనంతరం 2025 డిసెంబరులో విప్రో నిర్వహించిన సర్వే ద్వారా తమ ఆసక్తిని మరోసారి ధ్రువీకరించారని పేర్కొంది.​

2026 మార్చిలో అభ్యర్థులు కోడిలిటీ టెక్నికల్ అసెస్‌మెంట్‌కు హాజరై ఉత్తీర్ణత సాధించారు. మార్చి 24న క్లియరెన్స్ సమాచారం, మార్చి 25న బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ (బిజివి) లింక్ అందగా, మార్చి 26న బిజివి ప్రక్రియను పూర్తి చేశారు. విప్రో పోర్టల్‌లో బిజివి స్టేటస్ 100 శాతం పూర్తయినట్లు, నో యాక్షన్ రిక్వైర్డ్ అని చూపించినప్పటికీ ఆన్‌బోర్డింగ్‌పై స్పష్టత ఇవ్వలేదని నైట్స్ ఆరోపించింది.


నిర్ధిష్ట గడువు కోసం డిమాండ్‌..

నెలల తరబడి ఉద్యోగంలో చేరే అవకాశం కోసం ఎదురుచూడాల్సి రావడంతో అభ్యర్థులు ఆర్థిక, వృత్తిపరమైన అనిశ్చితిని ఎదుర్కొంటున్నారని నైట్స్ ఆందోళన వ్యక్తం చేసింది. అభ్యర్థుల పరిస్థితిపై స్పష్టత ఇవ్వడంతో పాటు, ఆన్‌బోర్డింగ్‌కు నిర్దిష్ట గడువు నిర్ణయించాలని కేంద్ర కార్మిక శాఖను కోరింది. అయితే ఫ్రెషర్లను తమ వ్యాపార అవసరాలకు అనుగుణంగా విధుల్లోకి తీసుకోవడానికి కట్టుబడి ఉన్నామని విప్రో తెలిపింది. తదుపరి పరిణామాలపై అభ్యర్థులకు సమాచారం అందిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్