- ఒకే వేదికపైకి బహుళ సేవలు
- నిహార్ ఇన్ఫో గ్లోబల్ ఛైర్మన్ సూర్య నారాయణ వెల్లడి
ప్రజాశక్తి - హైదరాబాద్ : దేశీయ లిస్టెడ్ ఈ-కామర్స్, ఐటి పరిష్కారాల సంస్థ ‘నిహార్ ఇన్ఫో గ్లోబల్ లిమిటెడ్’ తమ ఫ్లాగ్‌షిప్ పోర్టల్ గోల్డెన్‌సిల్వర్.షాప్ కార్యకలాపాల్లో విప్లవాత్మక మార్పులు చేపట్టినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు సాధారణ ఈ-కామర్స్ సైట్‌గా సేవలు అందించిన ఈ ప్లాట్‌ఫామ్‌ను.. ఇకపై పూర్తిస్థాయి డిజిటల్ గోల్డ్, సిల్వర్ టెక్నాలజీ, ఫిన్‌టెక్ ఈకోసిస్టమ్‌గా తీర్చిదిద్దినట్లు ఆ కంపెనీ ఛైర్మన్ బిఎస్‌ఎన్ సూర్యనారాయణ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నూతన వ్యూహాత్మక విస్తరణలో భాగంగా వినియోగాలు, పెట్టుబడుల కోసం ఒకే వేదికపైకి బహుళ సేవలను కంపెనీ అందుబాటులోకి తెస్తోన్నామన్నారు. భౌతిక రూపంలో లభించే పసిడి, వెండి నాణేలు, బిస్కట్లతో పాటు డిజిటల్ రూపంలోనూ మదుపు చేసేందుకు వీలుగా ఎఎంటిసి, పిఎఎంపి, సేఫ్‌గోల్డ్, ఆగ్మాంట్ భాగస్వామ్యంతో డిజిటల్ గోల్డ్, సిల్వర్ సేవలను ఈ పోర్టల్‌పై పునఃప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ సేవలు వెబ్‌వర్షన్‌లో లభిస్తున్నాయని.. వచ్చే ఏడాది జనవరి కల్లా యాప్‌ను ఆవిష్కరిస్తామని చెప్పారు. ఒకే వేదిక.. బంగారం, వెండిలో పెట్టుబడులకు ఎన్నో మార్గాలు అనేదే తమ ప్రధాన లక్ష్యమన్నారు. అదే విధంగా జెరోధా ద్వారా భారతీయ గోల్డ్ ఈటీఎఫ్‌లు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అంతర్జాతీయ విభాగాలు ద్వారా అంతర్జాతీయ ఇండెక్స్ ఈటీఎఫ్‌లను కొనుగోలు చేసే వెసులుబాటును పెట్టుబడిదారులకు కల్పిస్తోన్నామన్నారు. డిజిటల్ అసెట్స్‌ను సులభంగా భౌతిక బంగారం లేదా వెండిగా మార్చుకునే సదుపాయాలను ఈ ప్లాట్‌ఫామ్‌లో పొందుపరిచారు. వీటితో పాటు వినూత్నంగా బ్యాంకులు, ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల భాగస్వామ్యంతో డిజిటల్ గోల్డ్ లోన్ డిస్కవరీ పోర్టల్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.







కామెంట్‌లు (0)