-ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఘన విజయం సాధించాయని, 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రజల్లో కూటమికి ఆదరణ మరింత పెరిగిందని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టణ, పరిషత్ ఎన్నికల్లో కలిపి కూటమి 58.9 శాతం ఓట్లను సాధించిందని, 2024 ఎన్నికల్లో సాధించిన 55.3 శాతం ఓట్లతో పోలిస్తే 3.6 శాతం పెరుగుదల నమోదైందని వివరించారు. అదే సమయంలో వైసిపి ఓట్ల శాతం 39.81 నుంచి 33.56కు పడిపోయిందని, ఆ పార్టీకి 6.25 శాతం ఓట్లు తగ్గాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో కూటమికి, వైసిపి మధ్య ఓట్ల శాతంలో 25.34 శాతం వ్యత్యాసం ఉందన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో కూటమికి 59.9 శాతం వస్తే వైసిపికి 34.3 శాతం మాత్రమే వచ్చాయని తెలిపారు. పట్టణాల్లో కూటమి స్ట్రైక్ రేట్ 94 శాతంగా ఉందన్నారు. జెడ్పిటిసి ఎన్నికల్లో తమకు 57.6 శాతం, వైసిపికి 39.7 శాతం ఓట్లు వచ్చాయని, తమస్ట్రైక్ రేట్ 87.5గా ఉందన్నారు. పట్టణాల్లో కూటమికి 65.7 శాతం పోస్టల్ బ్యాలెట్లు రాగా, వైసిపికి 27.42 శాతం వచ్చాయని తెలిపారు. ఓట్ల శాతాలు చూస్తేనే ఉద్యోగులతో సహా అన్ని వర్గాలు కూటమిని ఏ స్థాయిలో తమను ఆదరించారో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. 659 జెడ్పిటిసిలలో 575 స్థానాలను కైవసం చేసుకున్నామన్నారు. మొత్తం 28 జిల్లాల్లో 27 జిల్లాల్లో కూటమి ఆధిక్యత సాధించిందని, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే వైసిపికి ఎక్కువ స్థానాలు వచ్చాయన్నారు. ఎంపిటిసి ఎన్నికల్లో మొత్తం 9,818 స్థానాలకు గాను కూటమి 7,803 స్థానాలను గెలుచుకుందని, రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం మండల అధ్యక్ష స్థానాలను కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉందన్నారు. మొత్తం 100 మేయర్, చైర్పర్సన్ పదవులకు గాను 94 స్థానాలను కూటమి గెలుచుకుందన్నారు. కడప జిల్లాలో రౌడీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారని, జిల్లాలోని తొమ్మిది పట్టణ స్థానిక సంస్థలూ కూటమి ఖాతాలోకి వచ్చాయని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే ఫలితాలు ఇలాగే ఉంటాయని తెలిపారు. అనంతపురంలో మేయర్ పదవి దక్కకపోయినా కార్పొరేటర్లలో ఎక్కువ మంది కూటమి తరఫున గెలిచారని పేర్కొన్నారు. ఏజెన్సీల్లో ఓట్లు తగ్గాయని, ఎందుకు తగ్గాయో లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏజెన్సీ ఏరియాలో అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ పనిచేశానని చెప్పారు. అరకు కాఫీ తన మానసపుత్రిక అని తెలిపారు. ఆ రెండు నియోజకవర్గాలను అనేక విధాలుగా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. తన జీవితంలో ఎప్పుడూ జరగనంతగా ప్రశాంతంగా ఈ ఎన్నికలు జరిగాయని వ్యాఖ్యానించారు.
500,1000 నోట్లు రద్దు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు ప్రభావం కనిపించలేదని చంద్రబాబు అన్నారు. ప్రజలు మంచి పాలకులకే ఓటు వేశారని, మంచి పాలన కావాలని ఆకాంక్షించారని చెప్పారు. డబ్బు రాజకీయాల సంప్రదాయం ఉండకూడదని చెప్పారు. అవినీతి నిర్మూలనకు డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని చెప్పారు. రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయాలని, రూ.100, రూ.200 నోట్లు మాత్రమే ఉండాలని తెలిపారు. పెద్ద కంపెనీలకు చెందిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలంటే ట్రస్టు ఏర్పాటు చేసి 10వేల కుటుంబాలను అభివృద్ధి చేసి రావాలని అన్నారు. అలా కాకుండా డబ్బులు పెట్టి పదవుల కోసం రాజకీయాల్లో వస్తామంటే కుదరదన్నారు. ‘నిరంతరం ప్రజాసేవ చేసుకునే వారికి సమయం ఎందుకని ప్రశ్నించారు. తారుమారు చేసేందుకు, ఓట్లు కొనేందుకు తప్ప మరొకటి కాదన్నారు. రాజకీయాల్లోకి రావాలంటే సర్వీస్ చేయాలని, అప్పుడే ప్రజలు గుర్తిస్తారని అన్నారు. . రెబల్స్‌గా పోటీ చేసిన అభ్యర్ధులను మరలా పార్టీలోకి తీసుకునే ప్రసక్తి లేదని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు.








కామెంట్లు (0)