గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘స్థానిక’ ఎన్నికలపై పిల్స్

1 గంట క్రితం

ap
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 01:02 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

ప్రజాశక్తి-అమరావతి : బిసి జనగణన, బిసి ఉపవర్గీకరణ, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన మూడు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో గురువారం వాదనలను ముగించిన హైకోర్టు తీర్పులను రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న చీఫ్ జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం మూడు పిటిషన్లలోనూ తీర్పులను రిజర్వ్ చేసింది. బిసి జనగణన పూర్తిచేసి దాని ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ బిసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు దాఖలు చేసిన పిటిషన్‌లో సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదనలు వినిపించారు. 1986లో వెనుకబడిన తరగతుల ఫైనాన్స్ కమిషన్ సేకరించిన గణాంకాల ఆధారంగానే ఇప్పటికీ రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని, బిసి జనగణన చేపట్టిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గతంలో ఆదేశించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. బిసిలను ఉపవర్గీకరించి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపైనా వాదనలు పూర్తయ్యాయి. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ.. చట్టబద్ధమైన నిబంధనలు లేనప్పుడు బిసిల ఉపవర్గీకరణ సాధ్యం కాదన్నారు.

ఈ పిటిషన్‌పైనా ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పూర్తయి తుది ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఎలక్షన్‌ ‌కమిషన్‌‌ను ఆదేశించాలని వైసిపి దాఖలు చేసిన పిటిషన్‌పైనా వాదనలు ముగిశాయి. సీనియర్ న్యాయవాది సుబ్రమణ్య శ్రీరామ్ వాదిస్తూ.. ఈ ఏడాది జనవరి 1 అర్హత తేదీతో ఉన్న అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తే అనేక మంది ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందన్నారు. రాష్ర్ట ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ వాదనలు వినపించారు. నోటిఫికేషన్ వరకు మార్పులు, చేర్పులను అనుమతిస్తామని తెలిపారు. ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ ఓటర్ల జాబితా సవరణ అనేది నిరంతర ప్రక్రియ అని, ఇది పూర్తయ్యే వరకు ఎన్నికలు నిలిపివేయాల్సిన అవసరం లేదని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్