విజయవాడ : ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరిపి పార్వతీపురం జిల్లా కొటియా ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ .... ముఖ్యమంత్రి చంద్రబాబుకి సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శుక్రవారం లేఖ రాశారు.
పార్వతీపురం జిల్లా కొటియా ప్రాంత ప్రజలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వం నిర్లక్ష్యం వలన తీవ్ర ఇబ్బందులనెదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నికలలో పాల్గొనవద్దని ఒడిశా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నదన్నారు. సంక్షేమ కార్యక్రమాలు, రేషన్ సరుకులు పంపిణీ జరగకుండా అడ్డుకుంటున్నదని, మైనింగ్ కోసం ఆ గ్రామాల ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నదని వివరించారు. 2026 ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలలో కోటియా గ్రామాల ప్రజలు పాల్గొనవద్దని గడిచిన వారం రోజులుగా ప్రతి గ్రామానికి ఒడిశా పోలీసులు చెక్ పోస్టులు పెట్టి నిర్బంధించారని, ఈ నిర్బంధాలను అధిగమించి పోలింగ్ ముందురోజు రాత్రి గ్రామాలు ఖాళీ చేసి, వేరే గ్రామాలకు బంధువుల ఇళ్ల వద్దకు రాత్రి చేరుకుని ఈ ఉదయం ఓటు వేసి తర్వాత స్వగ్రామాలకు చేరుకుంటున్నారని తెలిపారు. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంత ప్రజల అభీష్టానికనుగుణంగా సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నానని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
కొటియా ప్రాంతం పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు మండలంలో 4 గ్రామ పంచాయతీలలో 21 గ్రామాలతో 4,835 మంది జనాభాను కలిగి ఉందని వి.శ్రీనివాసరావు లేఖలో తెలిపారు. కొటియా ప్రాంతం తమదని ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టులో 1968లో దాఖలు చేసిందని, ఆంధ్రప్రదేశ్ కౌంటర్ దాఖలు చేసిందని గుర్తు చేశారు. 2006లో యథాతధ స్థితి కొనసాగించాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని వివరించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ గ్రామాల అభివృద్ధికి, ఆదివాసుల ప్రయోజనాలకు చర్యలు తీసుకోవాలని, సమస్యలను సంబాషణల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పింది... కానీ సంక్షేమ కార్యక్రమాలు అమలు, ఎన్నికలు వచ్చినప్పుడు సమస్యగానే ఉంటున్నదని తెలిపారు. కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత వరకు చర్చించుకోలేదనీ, సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. 2022లో ఒడిశా ప్రభుత్వం మళ్ళీ సుప్రీం కోర్టుకు వెళ్ళిందని, అయినా సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు. ఒడిశా ప్రభుత్వం ఇటీవల ఆ ప్రాంతంలో మైనింగ్ చేపట్టడానికి ప్రయత్నిస్తోందన్నారు. దానికనుగుణంగా అక్కడి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం, అంగన్‌వాడీ కేంద్రాల పరికరాలు ధ్వంసం చేయడం వంటి చర్యలు చేపడుతున్నదని, దీనివలన ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తాజాగా నేరెళ్ళ వలస జిసిసి డిపోకు రేషన్ సరుకులు తీసుకెళ్తున్న వాహనాన్ని ఒడిశా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. అక్కడి గ్రామాల ప్రజలే తిరగబడ్డారు తప్ప మన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని శ్రీనివాసరావు లేఖలో తెలిపారు.
కోరాపూట్ జిల్లా బిజెపి నాయకుడు రజిత్ పాండే ఆంధ్రా స్థానిక ఎన్నికల్లో పాల్గొనవద్దని గ్రామస్థులను హెచ్చరించారని వి.శ్రీనివాసరావు లేఖలో తెలిపారు. సరిహద్దు గ్రామాల్లో ఒడిశా ప్రభుత్వం పోలీసు బలగాలను మోహరించి రాకపోకలపై ఆంక్షలు విధించిందని, ఈ ఆంక్షలతో ఆ గ్రామాల ప్రజలు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. చివరకు దీనిపై ప్రజలు కోరాపూట్ సబ్‌కలెక్టర్, పోలీసులతో వాదించి ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించారని చెప్పారు. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్‌డిఏ ప్రభుత్వాలే ఉన్నందున కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీనికి సత్వర పరిష్కారం కనుగొనాలన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఒడిశా ప్రభుత్వాన్ని చర్చలకు ఒప్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కొటియా ప్రాంత ప్రజల అభిష్టానికనుగుణంగా సమస్యకు తక్షణం ముగింపు పలకాలని సిఎం చంద్రబాబును కోరుతూ వి.శ్రీనివాసరావు లేఖ రాశారు.








కామెంట్‌లు (0)