అమరావతి : ఎపి లో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో మొత్తం 659 జడ్పీటీసీ, 9,821 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 77 జడ్పీటీసీ, 2051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 21,012 మంది అభ్యర్థులు పోటీ చేశారు. నవంబర్ 7న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం నుంచి వాతావరణం అనుకూలించక పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల మధ్యాహ్నం వరకు నెమ్మదించిన ఓటింగ్ శాతం ... తర్వాత ఊపందుకుంది. సాయంత్రం 5 గంటలకు అధికారిక ప్రకటన వెలువడే సమయానికి గ్రామీణ ఎపి వ్యాప్తంగా సుమారు 65 శాతం నుంచి 68 శాతం మధ్య పోలింగ్ నమోదై ఉంటుందని ప్రాథమిక సమాచారం ఆధారంగా అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ అంతా ప్రశాంతంగా సాగలేదు. పలు జిల్లాల్లో అధికార ఎన్డీయే కూటమి , వైసిపి వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ ముగియడంతో .... 31,460 పోలింగ్ కేంద్రాలలో ఉన్న బ్యాలెట్ పెట్టెలకు అధికారులు ఏజెంట్ల సమక్షంలో పకడ్బందీగా సీళ్ళు వేశారు. ఈ బ్యాలెట్ బాక్సులను రెవెన్యూ, పోలీస్ నిఘా నీడలో సాయంత్రానికి స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వెబ్‌కాస్టింగ్ ద్వారా నమోదు చేసిన విజువల్స్‌ను విశ్లేషిస్తోంది.
ముగిసిన ‘పరిషత్’ ఎన్నికల పోలింగ్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 05, 2026, 05:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు





కామెంట్‌లు (0)