పట్టణ సంస్థల ఎన్నికల్లో రెచ్చిపోయిన కూటమి శ్రేణులు
యథేచ్ఛగా దొంగ ఓట్లు, పలుచోట్ల రిగ్గింగ్
రాజమహేంద్రవరంలో సోము వీర్రాజు వీరంగం
శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాద్ గృహనిర్బంధం
మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లో 74.65%, పొదిలి మున్సిపాల్టీలో 81.07%
ప్రజాశక్తి – యంత్రాంగం : పట్టణ స్థానిక సంస్థల పోలింగ్ ఉద్రిక్తతల నడుమ గురువారం జరిగింది. కూటమి శ్రేణులు రెచ్చిపోయాయి. యథేచ్ఛగా దొంగ ఓట్లు వేయించడం, పలు చోట్ల రిగ్గింగ్‌కు పాల్పడడంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పోలీసులు అధికార పార్టీకి యథేచ్ఛగా సహకరించారు. వైసిపి వారిపై నిర్బంధం ప్రయోగించారు. మంగళగిరిలో సిపిఐ ఏజెంట్‌పై ఎస్ఐ దౌర్జన్యం చేశారు. రాజమండ్రిలో బిజెపి ఎమ్మెల్సీ బస్తీమే సవాల్ అంటూ వైసిపి శ్రేణులపై తొడకొట్టారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషనల్లో వైసిపి మేయర్ అభ్యర్థి జనరల్ ఏజెంట్ ధర్మాన ప్రసాదరావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాల్టీలు, నగర పంచాయతీలతో కలిపి మొత్తం 23 పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్ జరిగింది. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో 74.65 శాతం, మార్కాపురం జిల్లా పొదిలి మున్సిపాల్టీలో 81.07 శాతం పోలింగ్ నమోదైంది. ఈనెల 30న కౌంటింగ్ జరగనుంది. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌లోని 62వ డివిజన్ మల్లయ్యపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టిడిపి, వైసిపి అభ్యర్థుల అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు అక్కడికి వచ్చి రెండు తొడలూ కొడుతూ ‘దమ్ముంటే రండిరా... ఇక్కడే ఉంటా... బస్తీమే సవాల్’ అంటూ మరింత రెచ్చగొట్టడంతో పరిస్థితి అదుపు తప్పింది. పారామిలటరీ దళాలు అక్కడికి చేరుకొని ఇరుగ్రూపులను దూరంగా పంపేశాయి.

మాజీ మంత్రి ధర్మాన గృహనిర్బంధం
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలీసుల తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. వైసిపి మేయర్ అభ్యర్థి గుండ లక్ష్మీదేవికి జనరల్ ఏజెంట్‌గా ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును పెద్డపాడులోని ఆయన నివాసంలో ఉదయం ఏడు గంటల నుంచే గృహ నిర్బంధం చేశారు. ధర్మానతో కలిసి పోలింగ్ కేంద్రాల సందర్శనకు వెళ్లడానికి తన వాహనంలో వచ్చిన మేయర్ అభ్యర్థి గుండ లక్ష్మీదేవిని సైతం గంటపాటు ఆపేశారు. ప్రభుత్వం, ఎన్నికల సంఘం, పోలీసుల తీరుపై ధర్మాన, లక్ష్మీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన జనరల్ ఏజెంట్‌ను ఆపే అధికారం ఏ అధికారికీ లేదని, అధికారులు నియమావళిని అతిక్రమించలేదని భావిస్తున్నప్పుడు నిర్బంధించ డానికి కారణాలను రాసి ఇవ్వాలని పోలీసు అధికారులను ధర్మాన డిమాండ్ చేశారు. ఉన్నతాధికా రులతో నేరుగా మాట్లాడినా ఫలితం లేకపోవడంతో ఆయన ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.
వైసిపి విజయనగరం అధ్యక్షులు బెల్లాన అరెస్టు
రాజాం మున్సిపాల్టీ ఏడో వార్డులో టిడిపి వారు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ వైసిపి కార్యకర్తలు ఆరోపించడంతో ఇరుగ్రూపుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన మాజీ ఎంపి, వైసిపి జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ను పోలీసులు అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు.
సిపిఐ ఏజెంట్‌పై ఎస్ఐ దౌర్జన్యం
మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి మంగళగిరి 17వ వార్డులో దొంగ ఓట్లు వేస్తుండగా అభ్యంతరం తెలిపిన సిపిఐ ఏజెంట్‌ను స్థానిక పోలీసులు లాక్కెళ్లిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఒక వ్యక్తి డబుల్ ఎంట్రీతో రెండోసారి ఓటు వేసేందుకు రావడాన్ని గమనించిన సిపిఐ పోలింగ్ ఏజెంట్ సాంబా, వెంటనే ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో, సదరు వ్యక్తిని పిఒ అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రం బయట ఉన్న ఎస్ఐ లోపలికి వచ్చి... ‘ఏంట్రా గోల.. పొద్దాక అడ్డంకులు పెడుతున్నావు’ అంటూ సాంబాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడపట్టి బయటకు లాక్కొచ్చి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పొన్నూరులో రిగ్గింగ్!
గుంటూరు జిల్లా పొన్నూరు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలు వార్డుల్లో అక్రమాలు, రిగ్గింగ్ జరిగినట్లు వైసిపి నాయకులు ఆరోపించారు. 19వ వార్డు పరిధిలోని చింతపూడి గ్రామంలో ఎన్నికల ఏజెంట్లను బయటకు పంపించి, ఓటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించడంతో పాటు ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఇతర వార్డుల్లో కూడా రిగ్గింగ్ జరిగిందని, దీనిపై పొన్నూరు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.







కామెంట్లు (0)