రూ.1300 కోట్ల విక్రయాలకు ప్రతిపాదన
ఎంటిఎన్‌ఎల్ పైనా కన్ను
ఆందోళనలో ఉద్యోగులు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన భూములు, భవనాలు, ఇతర ఆస్తుల విక్రయాన్ని మోడీ సర్కార్ మరింత వేగవంతం చేస్తోంది. తాజాగా టెలికం కంపెనీలు బిఎస్‌ఎన్‌ఎల్, ఎంటిఎన్‌ఎల్‌లకు సంబంధించిన రూ.1300 కోట్ల విలువ చేసే ఆస్తులను ప్రయివేటు, కార్పొరేట్ శక్తులకు విక్రయించడానికి సన్నద్దం అవుతోంది. ఈ ప్రతిపాదనలను తాజాగా నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్‌ఎంసి) పరిశీలించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో ఇప్పటికే రూ.9 వేల కోట్లకు పైగా ప్రభుత్వ రంగ ఆస్తులను విక్రయించి.. ఆ మొత్తాన్ని ఖజానాలో వేసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
బిఎస్‌ఎన్‌ఎల్, ఎంటిఎన్‌ఎల్‌కు చెందిన ఆస్తుల నగదీకరణ ప్రతిపాదనలను బుధవారం జరిగిన ఎన్‌ఎల్‌ఎంసి 22వ బోర్డు సమావేశం పరిశీలించిందని అధికార వర్గాలు తెలిపాయి. సుమారు రూ.1,300 కోట్ల విలువైన ఈ ప్రతిపాదనలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం తదుపరి ప్రక్రియకు తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నాయి. మరోవైపు ఎన్‌టిఎన్‌ఎల్ ఆధీనంలోని ఢిల్లీ, ముంబయిలో ఉన్న 17 నివాస ఆస్తుల విలువ నిర్ధారణ నివేదికలను కూడా బోర్డు పరిశీలించిందన్నారు. గతంలో ప్రయాగ్‌రాజ్, చెన్నయ్‌లోని ఆస్తులను వేలం వేసింది. తాజాగా ఢిల్లీ, ముంబయి ఆస్తుల నగదీకరణ జరగనుందన్నారు. విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) భూముల నగదీకరణ ప్రక్రియలో భాగంగా 459 ప్లాట్లను వేలం వేయడానికి కేంద్రం ఇప్పటికే చర్యలు చేపట్టింది.
విశాఖపట్నంలోని హెచ్‌బి కాలనీ, మద్దిలపాలెం, ఆటోనగర్, గాజువాక ప్రాంతాల్లో 93,572 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాట్ల వేలానికి సంబంధించి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లో పెట్టుబడిదారుల సమావేశాలు నిర్వహించింది. ప్రభుత్వ రంగ సంస్థల మిగులు, వినియోగంలో లేని ఆస్తులను మార్కెట్‌లోకి తీసుకొచ్చే ప్రతిపాదన పేరుతో అడ్డంగా ప్రయివేటు, కార్పొరేట్ శక్తులకు చౌకగా కట్టబెడుతోందని ఆ సంస్థల ఉద్యోగులు చాలా ఏళ్లగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.







కామెంట్‌లు (0)