దేశవ్యాప్తంగా అన్నదాతల ఆందోళన
బర్ద్వాన్‌లో బరితెగించిన బిజెపి మూకలు
ఎస్‌కెఎం నేత అమల్ హల్దార్ సహా 20 మందికి గాయాలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) దేశవ్యాప్త నిరసనను ప్రారంభించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జరిగిన నిరసన ప్రదర్శనలలో రైతులు మోడీ ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కు చట్టబద్ధత, రుణమాఫీ, విద్యుత్ ప్రైవేటీకరణ నిలిపివేత, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయకూడదని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఉపసంహరించుకోవడం వంటి డిమాండ్లతో పాటు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా, ఎస్ఐఆర్ రద్దు, ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ను శాంతియుత నిరసనలకు తిరిగి కేటాయించాలని వంటి డిమాండ్లను కూడా రైతులు లేవనెత్తారు. చారిత్రాత్మక రైతు ఉద్యమం ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఎస్‌కెఎం దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 2021 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘాలు, ఉద్యోగావకాశాలు ఉన్న కార్మికులతో సహా అనేక మంది ఈ నిరసనలో పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాలకు ముందు, దేశంలోని వివిధ ప్రాంతాలలో ఎస్‌కెఎం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిజెపి గూండాలు, పోలీసుల నేతృత్వంలో పలుచోట్ల హింస చెలరేగింది.
ఢిల్లీలో నిరసన ర్యాలీకి అనుమతి విషయంలో పోలీసులు దౌర్జన్యాలకు ఒడిగట్టినా.. రైతులు రాజ్యాంగం కల్పించిన శాంతియుత నిరసన హక్కును చాటుతూ భారీ ప్రదర్శన నిర్వహించారు. మందిర్ మార్గ్‌లోని కాళీబారి ఆలయం సమీపంలో సభ నిర్వహించిన అనంతరం జంతర్‌మంతర్ వైపు ర్యాలీగా బయలుదేరారు. మందిర్ మార్గ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రైతు నాయకులు యుధ్వీర్ సింగ్, రావుల వెంకయ్య రాష్ట్రపతికి రాసిన వినతిపత్రాన్ని అడిషనల్ డిసిపి జగదేవ్ సింగ్ కి అందజేశారు. సభలో ఎస్‌కెఎం నేతలు పి.కృష్ణప్రసాద్, రాజన్ క్షీరసాగర్, గౌరవ్ టికాయత్, సత్యవాన్, పురుషోత్తం శర్మ, డాక్టర్ సునీలం, గుర్మీత్ సింగ్ మెహ్మా, మనీష్ భారతి ప్రసంగించారు.
సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వంలో హర్యానాలోని బహదూర్‌గఢ్ నుండి టిక్రీ సరిహద్దు వరకు భారీ ర్యాలీ జరిగింది. అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజయ్ కృష్ణన్ సహా పలువురు నాయకులు ఈ యాత్రకు నేతృత్వం వహించారు. పోలీసులు రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లను రైతులు పడగొట్టి, టిక్రీ సరిహద్దు వరకు సాగారు. హర్యానాలో శాంతియుత నిరసనల్లో పాల్గొనకుండా రైతు సంఘం కార్యకర్తలను గృహ నిర్బంధంలో ఉంచడాన్ని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) తీవ్రంగా ఖండించింది. ఇది రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనని పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో పోలీసులు అనుసరిస్తున్న నిరంకుశ విధానాన్ని రాజకీయ పార్టీలు ఖండించాలని డిమాండ్ చేసింది. పోలీసుల నిర్బంధాలు కొనసాగితే రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం రైతులు శాంతియుతంగా పోలీస్ స్టేషన్ల వద్దకు ర్యాలీలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించింది.
అఖిల భారత కిసాన్ సభ నాయకత్వంలో మహారాష్ట్రలో వేలాది మంది రైతులు వీధుల్లోకి వచ్చారు. పాల్ఘర్ జిల్లాలోని దహను తాలూకాలో అదానీ గ్రూప్ యొక్క వధ్వాన్ పోర్ట్ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన ప్రజా నిరసనలో రైతులు కూడా పాల్గొన్నారు. దహనులో పోలీసులు మహిళలతో సహా పలువురిని అరెస్టు చేశారు. పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాటియాలా, అమృత్‌సర్, బఠిండాలలో బిజెపి ప్రభుత్వ విధానాలపై రైతుల ఆగ్రహం వెల్లువెత్తింది. బీహార్‌లోని పాట్నాలో జరిగిన యాత్రలో ఎర్ర జెండాలు వెల్లువెత్తాయి. నిరసన ప్రదేశాలలో రైతులు తమ డిమాండ్లను వివరిస్తూ అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు.

బెంగాల్‌లో బిజెపి మూకల దాడి
పశ్చిమ బెంగాల్‌లోని బర్ద్వాన్‌లో బిజెపి మూకలు రైతుల ప్రదర్శన, బహిరంగ సభపై దాడి చేశాయి. పశ్చిమ బెంగాల్‌లో అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు అమల్ హల్ద్వార్‌పై దారుణంగా దాడి జరిగింది. ఈ ఘటనలో అమల్ హల్ద్వార్ తీవ్రంగా గాయపడ్డారు. మరో 20 మంది కూడా గాయపడ్డారు. అయినప్పటికీ, రైతులు అన్ని అణచివేత ప్రయత్నాలను అధిగమించి ఐక్యంగా నిరసన చేపట్టారు. ఈ దాడిని ఎస్‌కెఎం తీవ్రంగా ఖండించింది.








కామెంట్‌లు (0)