అన్నమయ్య జిల్లాల్లో దళిత మహిళ సర్పంచ్, వార్డు మెంబర్లు అరెస్టు
శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లిలో బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ కాన్వాయ్‌పై రాళ్ల దాడి
తొలిదశ పంచాయతీలో 3,191 సర్పంచ్ ,25,061వార్డులకు ఎన్నికలు
ప్రజాశక్తి - యంత్రాంగం : రాష్ట్రంలో తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ వివాదాలు, ఘర్షణల మధ్య సాగింది. సర్పంచ్, వార్డు మెంబర్లను పోలీసులు స్టేషన్లకు తరలించడం, పలుచోట్ల వైసిపి మద్దతు ఏజెంట్లను బూత్ నుంచి బయటకు గెంటేయడం, టిడిపి కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడం, బ్యాలెట్ బాక్స్ లో ఇంకు పోవడం, రాళ్లదాడులు వంటి ఘటనలతో మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ ముగిసింది. గత జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. విశాఖపట్నం, గుంటూరు జిల్లాలు మినహా రాష్ర్టంలోని 26 జిల్లాల్లో పోలింగ్ నిర్వహించారు. మొత్తం 3,949 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటికేషన్ వెలువడింది. వాటిలో 709 పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. మరో 49 పంచాయతీల్లో సర్పంచుల స్థానాలు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,240 పంచాయతీల్లో (3,191 సర్పంచ్ స్థానాలకు) ఓటింగ్ జరిగింది. మొత్తం 39,832 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా వాటిలో 14,727 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 25,061 వార్డుల్లో పోటీ జరిగింది.
నిరసనకారులపైకి దూసుకెళ్లిన భూమా కాన్వాయ్
నంద్యాల జిల్లా అహోబిలంలో టిడిపి కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ వైసిపి కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కాన్వాయ్ వెంట వచ్చిన నంబర్ ప్లేట్ లేని కారు వైసిపి కార్యకర్తల వైపు దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. కారు కింద చిక్కుకున్న మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
ఇరు గ్రూపుల మధ్య జరిగిన రాళ్లదాడిలో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు పోలీసు బలగాలను రప్పించారు. ఆళ్లగడ్డ మండలం జి.జంబులదిన్నె గ్రామంలో వైసిపి మద్దతుదారులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ టిడిపి కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పరస్పరం కారంపొడి చల్లుకుంటూ, కర్రలతో దాడులకు దిగారు. దీంతో పోలింగ్‌కు అరగంట నిలిపివేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం నరసంపల్లిలో గ్రామ పంచాయతీ పరిధిలోని ఏడవ పోలింగ్ బూత్‌లోకి టిడిపి, వైసిపి మద్దతుదారులు చొరబడి బ్యాలెట్ బాక్సుల్లో ఇంకు పోశారు. దీంతో రీపోలింగ్ నిర్వహించనున్నారు. చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దలలో వైసిపి, టిడిపి మద్దతుదారులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఎన్నికల బందోబస్తుకు వచ్చిన సిఐ శేఖర్ వైసిపి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారు. అనంతపురం రూరల్ మండలం రాజీవ్‌కాలనీ పంచాయతీలో టిడిపి మద్దతుదారులు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ వైసిపి మద్దతుదారులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణ చోటు చేసుకుంది. రుద్రంపేట పంచాయతీలో వైసిపి మద్దతుదారుడైన బోయ సాయితేజపై టిడిపి అనుచరులు దాడి చేయడంతో తీవ్ర గాయాలు కావడంతో అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఆత్మకూరు మండలం బి.యాలేరులోనూ ఇరు గ్రూపుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లె మండల కేంద్రంలోని సంబేపల్లె గ్రామ సర్పంచ్‌గా దళిత మహిళా అభ్యర్థి కొప్పుల యశోదమ్మను వార్డు అభ్యర్థులను, వారి ఎన్నికల ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకు న్నారు. పోలింగ్ కేంద్రం ప్రధాన ద్వారానికి తాళం వేశారు. వారిని బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. శెట్టిపల్లి గ్రామ పంచాయతీలో వైసిపి మాజీ జెడ్‌పిటిసి సభ్యులు గొర్ల ఉపేందర్ రెడ్డి ని అక్రమంగా అరెస్టు చేయడంతో గ్రామస్తులు పోలీసువాహనాన్ని అడ్డుకున్నారు. వాహనం పైకి మహిళలు ఎక్కి నిరసన తెలిపారు.
ప్రకాశం జిల్లా కొండపి మండలం పెట్లూరు గ్రామంలో రెండవ వార్డ్ ఏజెంట్ వైసిపి సానుభూతిపరుడు కల్లూరి చంద్రమౌళిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. వెన్నూరులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిని పోలీసులు బూత్ నుంచి బయటకు గెంటేశారు. మార్కాపురం జిల్లా పామురు మండలం పామూరు పంచాయతీలో టిడిపి మద్దతుదారులు రిగ్గింగ్‌కు పాల్పడుతుండగా వైసిపి మద్దతుదారులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో టిడిపి, వైసిపి మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరు గ్రూపులను చెదరగొట్టారు. బొల్లా పల్లి మండలం వెల్లటూరులో బ్యాలెట్ బాక్స్ ల ధ్వంసం నేపథ్యంలో ఒకటో వార్డులో రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ జిల్లా అధికారులను ఆదేశించింది. మూగచింతల పాలెంలో రెండు గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది.
పోలీసులతో కోటా వినుత వాగ్వాదం
తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల వద్ద సర్పంచ్ అభ్యర్థి జయలలిత కుమార్తె కోటా వినుత పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులను పోలింగ్ కేంద్రంలోనికి పంపిస్తూ, తమ వారిని ఎందుకు అడ్డుకుంటున్నారని వాగ్వాదానికి దిగారు. పుల్లంపేట మండలం దేవసముద్రంలో గంటన్నర ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం మంగంపేట ఎపిఎండిసి రెండు పోలింగ్ బూత్ ల్లో అల్లరి మూకలు అల్లర్లు సృష్టించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైలవరం మండలం గణపవరంలో పాసులు లేని టిడిపి మద్దతుదారులు బూత్‌లోకి వెళ్లడాన్ని వైసిపి మద్దతుదారులు అభ్యంతరం తెలిపారు. దీంతో వైసిపి మద్దతుదారులందరినీ పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించారు. ఎన్‌టిఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామంలో టిడిపి, వైసిసి బూత్ ఏజెంట్ల మధ్య తోపులాట జరిగింది. ఈ సంఘటనలో వైసిపి ఏజెంట్ వెల్ది రాంబాబు తలకు గాయమైంది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ గ్రామ పంచాయతీలో ఓటు హక్కు వినియోగంపై మొదలైన వివాదం టిడిపి, వైసిపి మద్దతుదారుల మధ్య రాళ్ల దాడికి దారితీసింది. ఎమ్మెల్సీ నర్తు రామారావు గన్‌మన్ దామోదర్‌రెడ్డికి సైతం తలపై గాయమైంది.











కామెంట్‌లు (0)