శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పిఆర్‌‌సి కమిషన్‌ నియమిస్తాం

1 గంట క్రితం

cm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 09:04 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- అక్టోబర్‌‌లో రెండు పెండింగ్‌ డిఎలు విడుదల

- సంక్రాంతికి 2022 సరెండర్‌ లీవులు

- అడిషనల్‌ క్వాంటం ఆఫ్‌ పెన్షన్‌ పునరుద్ధరణ

- ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగులకు 12వ వేతన సంఘం కమిషన్(పిఆర్‌‌సి) ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీనిచ్చారు. పెండింగ్‌‌లో ఉన్న నాలుగు డిఎల్లో రెండు డిఎలను అక్టోబర్‌‌లో విడుదల చేస్తామని ప్రకటించారు. ఎపి సివిల్‌ ‌సర్వీసెస్‌ ‌జాయింట్‌ ‌స్టాఫ్‌ ‌కౌన్సిల్‌ ‌సమావేశం ఉండవల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగింది. ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలతతో ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. 2024 జులై 1, 2025 జనవరి 1లకు చెందిన రెండు డిఎలను 2026 అక్టోబర్ 1వ తేది నుంచి చెల్లిస్తామని వెల్లడించారు. 2022 సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవులను వచ్చే సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాలో జమ చేస్తామన్నారు. పోలీసులకు ఒక అడిషనల్ సరెండర్ లీవ్‌ను ఈ దసరాకు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వం రద్దు చేసిన పెన్షనర్ల అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్‌ను వచ్చే ఏడాది జనవరి నుంచి ఇస్తామని చెప్పారు. 70 ఏళ్లు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు దాటిని వారికి 15 శాతం మేర అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ వర్తింప చేస్తామన్నారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీం(ఇహెచ్‌ఎస్‌)ను స్ట్రీమ్ లైన్ చేస్తూ వచ్చే నెల నుంచే ఏ నెలకు ఆ నెల ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు చెల్లింపులు జరుపుతామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని, ఇబ్బందులు ఎన్ని ఉన్నా రెండేళ్ల కాలంలో ఒకటో తేదీన క్రమం తప్పకుండా జీతాలు ఇస్తున్నామని చెప్పారు.11 వేల మంది సిపిఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపచేశామని తెలిపారు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా వడ్డీలకు అప్పులు తెచ్చిందని విమర్శించారు. గత పాలకులు ఉద్యోగులను దగ్గరకే రానీయలేదని, తాము గౌరవిస్తూ సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు. ఆర్థిక వెసులుబాటు ఉంటే ఉద్యోగులకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్‌,సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ ‌రావత్‌, ఆర్ధికశాఖ కార్యదర్శులు వినయ్‌ ‌చంద్‌, రోనల్డ్‌ ‌రోస్‌, ఎపి ఎన్జివో అధ్యక్షులు ఎ విద్యాసాగర్‌, ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామకృష్ణ, అమరావతి జెఎసి చైర్మన్‌ ‌బొప్పరాజు వెంకటేశ్వర్లు, యుటిఎఫ్‌ ‌ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ‌ప్రసాద్‌, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ ఎస్టియు అధ్యక్షులు సాయి శ్రీనివాస్‌, ఎపిటిఎఫ్‌ అధ్యక్షులు జి హృదయరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్