10 అంశాలపై విడుదల
సమీక్షలో సిఎం చంద్రబాబు నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ‘ప్రోగెస్ రిపోర్ట్ 2024-26’ పేరుతో విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులను ఆదేశించారు. 2024లో అధికారం చేపట్టిన వెంటనే గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసంపై ఇచ్చిన 7 శ్వేత పత్రాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టులా ఈ ప్రోగ్రెస్ రిపోర్టులు ఉండాలని చెప్పారు. 7 శ్వేత పత్రాలతో పాటు మరో 3 ముఖ్యమైన అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టుల విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రొగ్రెస్ రిపోర్టుల విడుదలపై మంత్రులు, అధికారులతో ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలపై ముఖ్యమంత్రి శ్వేత పత్రాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండేళ్లలో వికాసం వైపు ఎలా తీసుకెళ్లింది, రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతలా పురోగతి సాధించింది వంటి అంశాలను తాజా ప్రోగ్రెస్ రిపోర్టులో పొందుపరచాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.రెండేళ్లలో చాలా శాఖల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, గవర్నెన్స్‌లో తెచ్చిన సంస్కరణలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వాన్ని ఎలా గాడిలో పెట్టామో చెప్పడంతో పాటు ఫేక్ న్యూస్‌కు చెక్ పెట్టడమే ప్రోగ్రెస్ రిపోర్టుల ఉద్దేశమని వివరించారు. నాటి 7 శ్వేత అంశాలతో సహా ఈసారి కొత్తగా డెవలప్‌మెంట్, గవర్నెన్స్, వెల్ఫేర్ అంశాలపైనా రిపోర్టులు విడుదల చేయాలని తెలిపారు. అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం అంశాలతో ‘డెవలప్మెంట్’ ప్రోగ్రెస్ రిపోర్ట్, ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా తెచ్చిన పాలసీలు, అనుసరించిన విధానాలు, చేపట్టిన సంస్కరణలతో ‘గుడ్ గవర్నెన్స్’ ప్రోగెస్ రిపోర్ట్, సంక్షేమం, పీ4 వంటి వాటితో ‘వెల్ఫేర్ – ఎంపవర్‌మెంట్’ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈసారి విడుదల చేయాలని తెలిపారు. ఇందులో ఫైనాన్స్, డెవలప్మెంట్, వెల్ఫేర్, గవర్నెన్స్ అంశాలకు సంబంధించిన ప్రొగ్రెస్ రిపోర్టును ముఖ్యమంత్రి విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు. 6 పేపర్లు మంత్రులు విడుదల చేసిన తర్వాత మిగిలిన 4 పేపర్లు ప్రజల ముందుంచాలని చంద్రబాబు నిర్ణయించారు. జూలై 18కల్లా మొత్తం అన్ని రిపోర్టులు విడుదల చేసేలా ప్రణాళికను సిద్దం చేయాలని సూచించారు. ఇవన్నీ విడుదల చేసిన తర్వాత అన్నీ కలిపి పుస్తక రూపంలో తీసుకురావాలని ఆదేశించారు. ప్రతీ ఏడాది ప్రోగ్రెస్ రిపోర్టులు తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ హాజరవ్వగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు పయ్యావుల కేశవ్, పి నారాయణ, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, డిజిపి హరీష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)