గురువారం, 05 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిశాఖ పోర్టు హాస్పిటల్‌‌ను ప్రయివేటీకరించొద్దని ధర్నా

1 గంట క్రితం

విశాఖ పోర్టు హాస్పిటల్‌‌ను ప్రయివేటీకరించొద్దని ధర్నా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 10:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : విశాఖపట్నం పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్‌ను ప్రైవేటీకరించే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని, పోర్టు యాజమాన్యమే తన సొంత నిధులతో ఆస్పత్రిని అభివృద్ధి చేయాలని పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన పోర్టు చైర్మన్ కార్యాలయం (ఎఒబి) వద్ద ధర్నా జరిగింది. గురువారం నిర్వహించిన ధర్నాలో పోర్టులోని సిఐటియు యూనియన్ గౌరవ అధ్యక్షులు విఎస్.పద్మనాభరాజు మాట్లాడుతూ ప్రజా వైద్య సంస్థగా ఉన్న పోర్టు హాస్పిటల్‌ సుమారు 40 వేల మంది కార్మికులు, ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది, వారి కుటుంబాలకు ఆధారంగా నిలుస్తోందన్నారు. ఈ ఆస్పత్రిని ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు పోర్ట్ యాజమాన్యం ప్రయత్నించడం అన్యాయమని పేర్కొన్నారు. గతంలో పిపిపి విధానంలో ఆస్పత్రిని ప్రైవేటీకరించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు 532 రోజుల పాటు నిరంతర పోరాటం నిర్వహించాయని గుర్తుచేశారు. ఫలితంగా అప్పట్లో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు యాజమాన్యం ప్రకటించిందని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు ప్రయివేటీకరణ దిశగా అడుగులు వేయడం కార్మికవర్గాన్ని మోసం చేయడమే అవుతుందన్నారు. ఈ అంశంపై హైకోర్టులో న్యాయపోరాటం కొనసాగుతున్నప్పటికీ ఈ నెల ఆరున టెండర్లు తెరవడానికి పోర్ట్ యాజమాన్యం ప్రయత్నించడం కోర్టు విచారణను, కార్మికుల ఆందోళనలను పట్టించుకోకపోవడమేనని విమర్శించారు. ఆస్పత్రి అభివృద్ధి పేరుతో 5.91 ఎకరాల విలువైన పోర్టు భూములను ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రతి ఏటా వందల కోట్ల ఆదాయం, వేల కోట్ల రూపాయల రిజర్వు నిధులు కలిగిన పోర్టు యాజమాన్యానికి ఆస్పత్రిని అభివృద్ధి చేసుకునే ఆర్థిక సామర్థ్యం ఉందని తెలిపారు. ధర్నాలో సిఐటియు నాయకులు సత్యనారాయణ, ఈశ్వరరావు, జగన్, ఎఐటియుసి నాయకులు పోతన్న, హెచ్‌ఎంఎస్ నాయకులు అంజి, మంగయ్య నాయుడు, సిఎఫ్‌టియుఐ నాయకులు ఎన్.కనకారావు, బిఎంఎస్ నాయకులు సురేష్, విడిఎల్‌బి నాయకులు లక్ష్మణరావు, కార్మికులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్