పని దినాలను 200 రోజులకు పెంచండి
కేంద్ర బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎల్నినో వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాన్ని, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేలా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. కరువు పరిస్థితుల అంచనా కోసం రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని బుధవారం కలిసింది. కరువు అధ్యయన వివరాలను ముఖ్యమంత్రికి కేంద్ర బృందం వివరించింది. రాష్ట్రంలోని తీర ప్రాంతం తుపాన్ల సమస్యతో ఇబ్బందులు పడుతుంటే... మరోవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో కారణంగా రాయలసీమ సహా ఇంకొన్ని ప్రాంతాలు తీవ్ర కరువుతో అల్లాడుతున్నాయని సిఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది సాధారణం కంటే గణనీయంగా తక్కువ వర్షపాతం నమోదైందని, దీర్ఘకాలిక వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, సాగునీటితో పాటు తాగునీరు, పశుగ్రాసం సమస్యలు కూడా తలెత్తాయని వివరించారు. అనంతపురం జిల్లాలో దేశంలోనే రెండో అత్యల్ప వర్షపాతం నమోదైన పరిస్థితిని బృందం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో 21 జిల్లాల్లో 412 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించామని, రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి వారం రోజుల్లో కరువు పరిస్థితులపై కేంద్రానికి నివేదిక కూడా సమర్పిస్తామని సిఎం తెలిపారు.
కరువు పరిస్థితుల నేపథ్యంలో విబి గ్రామ్ జి పథకం కింద కనీస పనిదినాలను 200 రోజులకు పెంచి, వ్యవసాయ రంగంలోని వివిధ పనులకు ఈ పథకాన్ని వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని కేంద్ర బృందాన్ని సిఎం చంద్రబాబు కోరారు. రైతుల ఆదాయం గణనీయంగా తగ్గిపోతోందని, వ్యవసాయ రుణాల చెల్లింపులపై కూడా ప్రభావం పడుతోందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అర్హులైన కరువు బాధిత కుటుంబాలకు డ్రాట్ కార్డులు జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దీంతో కేంద్ర సహకారంతో నిత్యావసర సరుకుల ధరలు సబ్సిడీపై అందించే వీలుంటుందని చెప్పారు. అలాగే, రైతులకు రుణాల రీషెడ్యూలింగ్ వంటి ఉపశమన చర్యలు అందేలా కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భూగర్భ జల మట్టాలు గణనీయంగా పడిపోవడంతో అనేక ప్రాంతాల్లో అదనంగా బోర్లు వేసినా ఆశించిన ఫలితం ఉండటం లేదన్నారు. తాత్కాలిక నీటి సరఫరా చర్యలతో పాటు శాశ్వత పరిష్కారాలపై దృష్టి పెట్టాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పథకాన్ని మరింత విస్తరించి, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులను అభివృద్ధి చేయడం, అనుసంధానించడం వంటి సమర్ధ నీటి నిర్వహణ పనులకు కేంద్రం సహకరించాలని కోరారు.
15 రోజుల్లో కేంద్రానికి నివేదిక
రాష్ట్రంలోని కరువు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాలను, రైతుల సమస్యలను పరిశీలించింది. రైతులతో నేరుగా మాట్లాడి పరిస్థితులను తెలుసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాలు, క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగా 15 రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని బృందం తెలిపింది. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రానికి అవసరమైన కేంద్ర సహాయంపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు.








కామెంట్లు (0)