పోలీసులకు హైకోర్టు ఆదేశం
ప్రజాశక్తి – అమరావతి : అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్‌పి ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని గోపికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన ఘటన, నిందితుడు హేమంత్‌పై పోలీసులు జరిపిన కాల్పుల వ్యవహారానికి సంబంధించి స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటనపై సిబిఐతో సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై బుధవారం విచారణ జరిపింది. దాడిలో గాయపడిన బాలిక ఆరోగ్య పరిస్థితిని ధర్మాసనం అడిగి తెలుసుకుంది. పిటిషనర్ తరపున న్యాయవాది సాల్మన్ రాజు వాదనలు వినిపిస్తూ.. మీడియా కథనాల ప్రకారం నిందితుడిని ధర్మవరం రైల్వే స్టేషన్ వద్ద పట్టుకున్నారని, ఆ తర్వాత ఆత్మకూరు అడవుల్లో తలదాచుకున్న అతడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారని తెలిపారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్నారు. పిటిషన్ దాఖలు చేసిన తనపై మీడియా, సోషల్ మీడియాలో వ్యతిరేక కథనాలు వస్తున్నాయని, మీడియా ట్రయల్ జరగకుండా ఆదేశాలివ్వాలని కోరారు. మంగళగిరికి చెందిన న్యాయవాది గుండా గోపికృష్ణ ఈ పిల్ దాఖలు చేశారు. తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.







కామెంట్‌లు (0)