అమరావతి : ఎల్ నినో ప్రభావంతో ముఖం చాటేసిన వరుణుడు కరుణిస్తుండటంతో ప్రజలు, రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. శనివారం సాయంత్రం రాష్ట్రంలో అనేత ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో రహదారులు జలమయమయ్యాయి. మరోవైపు అల్పపీడన ప్రభావంతో ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, 24 గంటల్లో ఇది విదర్భ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో నేడు(ఆదివారం) ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని చెప్పింది. దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వానలు, రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కోనసీమ జిల్లా మలికిపురంలో అత్యధికంగా 79.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరులోని శారదా కాలనీలో 50.18 మిల్లీమీటర్లు, ఎన్టీఆర్ జిల్లా గుణదలలో 49, కృష్ణా జిల్లా నందమూరులో 38.5, పోలవరం జిల్లా కూనవరంలో 32.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.
తిరుమలలో భారీ వర్షం : శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్న వేళ తిరుమలలో భారీ వర్షం కురిసింది. తిరుమల వ్యాప్తంగా రోడ్లపై నీరు ప్రవహించింది. ఇటీవల వరుణయాగం పూర్తిచేసుకున్న అనంతరం శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. గంటపాటు వర్షం కురవడంతో రోడ్లన్నీ నీటి ప్రవాహంతో కనిపించాయి. యాత్రికులు ఆలయ సమీపంలోని వాహన మండపం, రాంభగీచ ఎదురుగా ఉన్న షెడ్లలో తలదాచుకున్నారు. కొన్ని రోజులుగా ఎండవేడిమితో ఇబ్బంది పడుతున్న ప్రజలు వర్షంతో ఉపశమనం పొందారు.
కోనసీమలో జోరువాన : అల్పపీడనం ప్రభావంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వర్షం దంచికొట్టింది. శనివారం జిల్లావ్యాప్తంగా సగటున 37.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంబాజీపేట ఆర్టీసీ బస్టాండ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆయుర్వేద వైద్యశాలల ముందు భారీగా వర్షపు నీరు నిలిచింది. అంబాజీపేట ఉద్యాన పరిశోధన కేంద్రం సమీపంలో అమలాపురం- రావుల పాలెం ప్రధాన రహదారిపై చెట్టు కుప్పకూలింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు.
నీటిమునిగిన నిడదవోలు బస్టాండ్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు బస్టాండ్ జలమయమైంది. చిన్నపాటి వర్షం కురిసినా బస్టాండ్‌లో నీరు నిలబడిపోతుంది. మురుగునీరుతో పాటు కలిసిపోయి ప్రాంగణంలో ప్రవహించడంతో ప్లాట్‌ఫామ్‌ల్లోకి చేరుకునేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల తరబడి ఇదే సమస్య వేధిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గతంలో ఓసారి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ బస్టాండ్ నీట మునిగినప్పుడు పరిశీలించారు. సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించినా ఇప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించి బస్డాండ్‌లో వాన నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి : అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పోలీస్, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత సూచించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి విపత్తుల సంస్థ, ఆర్టీజీఎస్ అందించే సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటేందుకు ప్రయత్నించవద్దన్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో రాకపోకలను నిలిపివేయాలని హోంమంత్రి దిశానిర్దేశం చేశారు.







కామెంట్‌లు (0)