ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హార్ముజ్‌ జలసంధిలో కొత్త రాకపోకల మార్గాలపై ఇరాన్‌, ఒమన్‌ అంగీకారం

18 నిమిషాల క్రితం

Strait of Hormuz
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 01:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మస్కట్‌ : హార్ముజ్‌ జలసంధిపై కొత్త రాకపోకల మార్గాలను ఏర్పాటు చేసే అంశంపై ఇరాన్‌, ఒమన్‌ ఒక అవగాహనకు వచ్చారని ఇరాన్‌ అధికారులు వెల్లడించినట్లు జిన్హువా న్యూస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అంశంపై తమ మధ్య జరిగిన చర్చల వివరాలను సోమవారం మస్కట్‌లో జరిగే ప్రాంతీయ సమావేశంలో గల్ఫ్‌ దేశాలకు వెల్లడించనున్నారని పేర్కొంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో వ్యూహాత్మకమైన హార్ముజ్‌ జలసంధిపై అంతర్జాతీయ దృష్టి నెలకొంది. బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియన్‌ మాట్లాడారు. అమెరికా అనుసరిస్తున్న ఏకపక్ష ఆంక్షలను ఎదుర్కొనేందుకు బ్రిక్స్‌ దేశాలు ప్రత్యామ్నాయ వాణిజ్య, సహకార విధానాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఏకపక్ష ఆంక్షల విధానాన్ని ఎదుర్కోవడంలో బ్రిక్స్‌ సభ్య దేశాలు పరస్పరం మద్దతుగా నిలవాలని అన్నారు. పశ్చిమాసియా పరిస్థితిపై బ్రిక్స్‌ దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆర్థిక సంబంధాల కార్యదర్శి సుధాకర్‌ దలేలా తెలిపారు. సంఘర్షణలను పరిష్కరించేందుకు చర్చలు, దౌత్యమే మార్గదర్శక సూత్రాలుగా ఉండాలని బ్రిక్స్‌ దేశాలు స్పష్టం చేశాయని చెప్పారు. ఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశంలో ఆమోదించిన ‘న్యూఢిల్లీ డిక్లరేషన్‌ 2026’లో పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలని, పౌరులు, పౌర మౌలిక సదుపాయాలను రక్షించాలని, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రపంచ వాణిజ్యం, సరఫరా గొలుసులు, ఇంధన సరఫరాలు సజావుగా సాగేలా చూడాల్సిన అవసరాన్ని బ్రిక్స్‌ దేశాలు నొక్కిచెప్పాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్