- రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశవ్యాప్తంగా ఔషధాల ధరల నియంత్రణకు సమగ్ర జాతీయ విధానాన్ని తీసుకురావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ విజ్ఞప్తి చేశారు. నకిలీ ఔషధాల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు డిజిటల్ మెడిసిన్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రధానికి సోమవారం లేఖ రాసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మందుల తయారీ నుంచి విక్రయం వరకు పర్యవేక్షణ ఉండేలా పటిష్ట వ్యవస్థను రూపొందించాలని సూచించారు. మధుమేహం, గుండె, మూత్రపిండాల వ్యాధులకు వినియోగించే ఔషధాల ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అత్యవసర, ప్రాణాధార మందులపై ట్రేడ్ మార్జిన్లకు శాస్త్రీయ ప్రాతిపదికన పారదర్శక పరిమితులు విధించాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వాస్పత్రుల్లో మరిన్ని ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసి తక్కువ ధరలకు మందులు అందించాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య బీమా పథకాలతో అనుసంధానించాలని విజ్ఞప్తి చేశారు. మలేరియా, ఇతర అంటువ్యాధుల ప్రభావం ఎదుర్కొంటున్న గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మందుల ధరల తగ్గింపుపై వైద్య నిపుణులైన ఎంపిలతో ప్రత్యేక చర్చ నిర్వహించాలని పేర్కొన్నారు.








కామెంట్లు (0)