బిసిల రిజర్వేషన్లపై టిడిపి కూటమి డ్రామాలు
మాజీ సిఎం వైఎస్ జగన్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎల్‌నినో వస్తుందని తెలిసీ ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ఫలితంగా లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. డిఎస్‌సిపై విచారణకు తాము సిద్ధమని చెప్పినా ప్రభుత్వం ముందుకు రాలేదని అన్నారు. రాష్ట్రాన్ని కరువు కాటేస్తున్నా చంద్రబాబు కళ్లు తెరవడం లేదని, వర్షపాతం లోటు మైనస్ 52 శాతం ఉందని పేర్కొన్నారు. గతంలో రాయలసీమకు పరిమితమైన కరువు పరిస్థితులు నేడు కోస్తాంధ్రలోనూ ఉన్నాయని అన్నారు. జూన్ నుంచి ఇప్పటి వరకు 189.62 మిల్లీమీటర్ల వర్షపాతమే పడిందని తెలిపారు. ‘డ్రైస్పెల్స్’ వచ్చాయని, 688 మండలాలుంటే 625 మండలాల్లో లోటు వర్షపాతమే ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 25 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉందన్నారు. 191 మండలాల్లో తీవ్ర పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ఖరీఫ్‌లో సాధారణ సాగుకన్నా 20 శాతం తగ్గిందని, సీజన్ ప్రారంభంలో జులై 10న పంటలకు నీళ్లిస్తామంటూ ప్రకాశం బ్యారేజీ లాకుల వద్ద నీళ్లు విడుదల చేశారని తెలిపారు. నీళ్లిస్తారనే ఉద్దేశంతో కృష్ణా డెల్టాతోపాటు ఇతర ప్రాంత రైతులు విత్తనాలు, ఎరువులు కొని, నార్లు వేశారని అన్నారు. అవన్నీ దాదాపు ఎండిపోయి ప్రతి ఎకరాకు రైతు రూ.15 వేలు నష్టపోయారని తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి నీళ్లిచ్చే విషయంలో సిఎం తీరు దుర్మార్గంగా ఉందన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 885 అడుగులైతే, ఈ ఆగస్టులోనే 879.50 అడుగులకు నీళ్లు వచ్చినా, పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లివ్వడానికి సిఎం చంద్రబాబుకు మనసు రాలేదని తెలిపారు. నాగార్జునసాగర్ కింద ప్రాంతాల్లో వ్యవసాయం పరిస్థితి కూడా అలాగే ఉందని అన్నారు. పులిచింతల వద్ద తెలంగాణ ప్రభుత్వం చింతలపాలెం మండలం పాత వెల్లటూరు వద్ద బ్యాక్‌వాటర్ నుంచి ఎనిమిది టిఎంసిలు తరలించడానికి రూ.1,450 కోట్లతో చేపట్టిన మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం పంప్ హౌజ్ నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్నారు. అదే మండలం బుగ్గమాదారం వద్ద కృష్ణా నది నుంచి 2.5 టిఎంసిలు తరలించడానికి రూ.394 కోట్లతో చేపట్టిన రాజీవ్ ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరుగుతున్నాయని, వాటి గురించి కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మరోవైపు రైతులకు ఆర్థిక రక్షణగా ఉచిత పంటల బీమాను రద్దుచేయడంతో రైతులే ప్రీమియం భారాన్ని కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 2026-27 ఖరీఫ్‌లో కేవలం 35.17 లక్షల దరఖాస్తులు మాత్రమే పంటల బీమా కిందకు వచ్చాయని తెలిపారు.
పంటల బీమా రక్షణ దాదాపు 70 శాతం తగ్గిందన్నారు. బీమా కట్టకపోవడంతో రైతులకు అందాల్సిన దాదాపు రూ.3 వేల కోట్లు వారికి రాకుండా పోయాయని పేర్కొన్నారు. 2025 అక్టోబరులో మొంథా తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఇప్పటికీ ఒక్కపైసా కూడా ఇవ్వలేదన్నారు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎగరగొట్టారని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్న కూలీలకు అదనంగా ఉపాధి హామీ పనులు, పేదలు ఆహార భద్రతను కల్పించడం వంటి చర్యలు కూడా తీసుకోలేదని అన్నారు. బిసి రిజర్వేషన్లపై డ్రామాలు అడుతున్నారని, తాము జిఓ తీసుకొస్తే బిర్రు ప్రతాపరెడ్డితో కోర్టులో కేసు వేయించారని, హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిసి, మళ్లీ కోర్టుకు పోయి అడ్డుకోవద్దంటూ కపట నాటకాలు ఆడుతున్నాడని అన్నారు.







కామెంట్‌లు (0)