స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు తపన్ సేన్ పిలుపు
ప్రజాశక్తి- ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కార్మిక హక్కుల పరిరక్షణకు సమరశీల పోరాటాలు చేపట్టాలని స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు తపన్ సేన్ పిలుపునిచ్చారు. ఉక్కునగరంలోని సిఐటియు కార్యాలయంలో బుధవారం స్టీల్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధిలో ఉక్కు రంగం కీలకమైందని, ఈ రంగం ప్రైవేటు సంస్థల ఆధీనంలోకి వెళ్తే దేశాభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఎగుమతులు, దిగుమతులకు అనువైన విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు జరుగుతున్న పోరాటం దేశభక్తియుతమైనదన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశాభివృద్ధి కంటే కార్పొరేట్ సంస్థలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని అణచివేయ డానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారని తెలిపారు. మరోవైపు విశాఖ ఉక్కు యాజమాన్యం... కార్మికుల హక్కులను ఒక్కొక్కటిగా తొలగిస్తోంద న్నారు. మేధావుల మౌనం ప్రమాదకరమని, నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పాలని తపన్ సేన్ పిలుపునిచ్చారు.
నూతన నియామకాలు చేపట్టాలి : లలిత్ మిశ్రా
స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి లలిత్ మిశ్రా మాట్లాడుతూ కార్మికులను ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురిచేసే విధానాలను ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. లేబర్ కోడ్ల వల్ల అనేక చట్టబద్ధమైన హక్కులు కార్మికులకు దూరమవుతున్నాయని తెలిపారు. శాశ్వత కార్మికుల సంఖ్య తగ్గిపోవడంతో కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెరిగిందని, ప్రస్తుతం ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ పేరుతో కార్మికులకు హక్కులు లేకుండా చేస్తున్నారని వివరించారు. భద్రతా ప్రమాణాల లోపం, నాసిరకం పరికరాల వినియోగం కారణంగా కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే స్టీల్ ప్లాంట్‌లో నూతన నియామకాలు చేపట్టి కార్మికుల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు.
పోరాటాల ఫలితమే విశాఖ ఉక్కు : సిహెచ్ నర్సింగరావు
పోరాటాల ఫలితంగానే విశాఖ ఉక్కు ఆవిర్భవించిందని, నేటికీ పోరాటాల ద్వారానే మనుగడ సాగిస్తోందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు వివరించారు. బిఐఎఫ్‌ఆర్, నీటి సమస్యలను అధిగమించి ప్లాంట్ విస్తరణ, నూతన నియామకాలు, కెబిఆర్-2 నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. సొంత గనులు సాధించేందుకు, వంద శాతం వ్యూహాత్మక అమ్మకానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు కొనసాగుతున్నాయన్నారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు యాజమాన్యం నిర్బంధాన్ని, కార్మిక హక్కులపై దాడులను తీవ్రతరం చేసిందని వివరించారు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) గౌరవాధ్యక్షులు ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తికి అవసరమైన బ్యాలెన్సింగ్ సదుపాయాలు లేవన్నారు. కోక్ ఓవెన్ బ్యాటరీ-6, రోలింగ్ మిల్స్ నిర్మాణంతో పాటు కోక్ ఓవెన్ బ్యాటరీలు ఒకటి నుంచి నాలుగు వరకు, సింటర్ ప్లాంట్, ఆర్‌ఎంహెచ్‌పిలలో తక్షణమే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఉక్కు మంత్రి రూ.ఎనిమిది వేల కోట్లు అందిస్తామని హామీ ఇచ్చి ఐదు నెలలు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి ప్రక్రియా ప్రారంభం కాలేదన్నారు. కార్మికులకు బకాయిపడిన రూ.900 కోట్లను వెంటనే చెల్లించపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రామస్వామి, జె.అయోధ్యరామ్, వివిధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు, వర్కింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)