బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కోదాడ వద్ద ఘోరం

26 ఆగస్టు, 2026

accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 12:42 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఇనుప రా‌డ్లు ఉన్న కంటైనర్ ను ఢీకొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్ బస్సు

  • ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఆరుగురి దుర్మరణం

  • 14 మందికి తీవ్ర గాయాలు

  • • నుజ్జునుజ్జయిన మృతదేహాలు

​ప్రజాశక్తి - యంత్రాంగం : తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ఐరన్‌ రాడ్ల లోడుతో వెళ్తూ ప్రమా‌దానికి గురై రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్‌‌ను ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ బస్సు బలంగా ఢీ‌కొట్టింది. దీంతో, ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వారు. వారి మృతదేహాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. ఈ దారుణ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపి, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

road acidnet.jpg

పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్ నుంచి ఏలూరుకు 42 మంది ప్రయాణికులతో ప్రెష్‌ ప్రైవేట్‌ ట్రావెల్ బస్సు బయలుదేరింది. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ అకస్మాత్తుగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. అదే సమయంలో అటువైపు నుంచి అతి వేగంగా వచ్చిన ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు ఆ కంటైనర్‌‌ను బలంగా ఢీకొనడంతో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. కంటైనర్‌‌లోని ఐరన్ రాడ్లు బస్సులోకి దూసుకెళ్లాయి. నిద్రమత్తులో ఉన్న ప్రయాణికుల తలలో అవి గుచ్చుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. బస్సులోనే ఆరుగురు మృతి చెందారు. వీరిని విజయవాడకు చెందిన మేరీ జ్యోత్స్న (29), సురవరపు షకీనా (24), కూండ్రపు భావన వర్ష (25), పిడికిలి లక్ష్మి (25), కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన యాసారపు చిన్ని (32), పమిడిముక్కల మండలం లంకపల్లికి చెందిన చెన్నకేశవ నాగేంద్రబాబు (31)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురిని విజయవాడకు, మిగిలిన వారిని ఖమ్మం, కోదాడ ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. ఆరుగురి మృతదేహాలను పోలీసులు కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేట్‌ ‌బస్సు డ్రైవర్‌ మల్లికార్జున నిద్రమత్తు, అతివేగం ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ప్రమాద ఘటన తర్వాత ఆయన పరారయ్యారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం

ఈ ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిం చారు. ప్రమాదానికి సంబంధించిన సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించేలా తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ‌రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి

ఈ ప్రమాదం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని రేవంత్ రెడ్డి ఆదేశించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్