ఎఐ ఆధారిత ఆరోగ్య సేవలకు ప్రాధాన్యత
సమీక్షలో సిఎం చంద్రబాబు ఆదేశం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : జనవరి ఒకటవ తేది నుండి ‘సంజీవని ప్రాజెక్టు’ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుపై బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, డిజిటల్ హెల్త్ రికార్డులతో సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సాధించవచ్చన్నారు. కుప్పం, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే సంజీవని ప్రాజెక్ట్ అమలుతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం విద్యకు, వైద్యానికే అత్యధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని, ఈ వ్యయాన్ని తగ్గించేలా చూసేందుకు సంజీవని వంటి కార్యక్రమాలను తీసుకువస్తున్నట్టు వెల్లడించారు. వైద్య సేవలు అందించడంతో పాటు ఆహారపు అలవాట్లు, ఆలోచనా విధానం మారేలా చూడాలని చెప్పారు. హోమియోపతి, ఆయుర్వేద, యోగా, ప్రాణాయామం, ఇంకా అత్యాధునిక వైద్య విజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఎఐ డాక్టర్‌ను విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావాలన్నారు. డేటాను భద్రపరచడం, గోప్యంగా ఉంచడంతో పాటు, డ్యాష్ బోర్డు సిద్ధం చేయాలని కోరారు. ఆస్పత్రుల్లో శానిటేషన్ సహా వివిధ ఔట్ సోర్సింగ్ సేవల విషయంలో దృష్టి పెట్టాలని, సమర్ధవంతంగా వైద్య సేవలు అందించని ఔట్ సోర్సింగ్ సర్వీస్ ప్రొవైడర్లను తొలిగించేలా ఒక విధానం తీసుకురావాలని ఆదేశించారు. విశ్వాసం పెంచేలా వైద్య సేవలు ఉండాలని, ప్రజల మొబైళ్లకు నేరుగా హెల్త్ అప్డేట్స్ పంపించేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని చెప్పారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు 90 రోజుల ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పారు. బేస్‌లైన్ అధ్యయనం, డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటు, శిక్షణ, సర్టిఫికేషన్, జాతీయ, రాష్ట్ర పోర్టల్స్‌తో ఇంటిగ్రేషన్ వంటి చర్యలు 90 రోజుల ప్రణాళికలో ఉన్నాయని చెప్పారు. చిత్తూరులో నమోదైన ఫలితాల ప్రకారం... హైపర్‌టెన్షన్ కేసుల్లో 56 శాతం కేసులు నియంత్రణలోకి వచ్చినట్టు తేలిందన్నారు. డయాబెటిస్ కేసుల్లో 16 శాతం కేసుల తీవ్రత తగ్గిందన్నారు.
అలాగే, ప్రైమరీ హెల్త్‌కేర్ సేవల వినియోగంలోనూ గణనీయమైన పెరుగుదల నమోదైనట్టు వెల్లడించారు. సంజీవని సేవలపై పౌరుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నిర్వహించిన సర్వేలో 91 శాతం మంది సంజీవని సేవల అనంతరం తమ ఆరోగ్యంపై అవగాహన పెరిగిందని చెప్పారు. స్క్రీనింగ్ నుంచి చికిత్స, ఫాలోఅప్ వరకు ఎఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్, సంయుక్త కార్యదర్శి రోణంకి గోపాలకృష్ణ, టాటా ఎండీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)