నేపాల్‌లో మెరుపు వరదల బీభత్సం
150 మందికి పైగా మృతి..
కొట్టుకుపోయిన ఊళ్లకు ఊళ్లు
కన్నుమూసి తెరిచేంతలో బురద దిబ్బలుగా మారిన గ్రామాలు
కొన్ని గ్రామాల్లో ఏడవడానికి కూడా మిగలని ధైన్యం
384 మంది పర్యాటకులు గల్లంతు
వారిలో 150 మంది భారతీయులు
మరణాల సంఖ్యపై ఆందోళన
ఖాట్మండు : హిమాలయాల దేశం నేపాల్‌పై జలప్రళయం విరుచుకుపడింది. ఊహించని ఉపద్రవంతో ప్రకృతి సౌందర్యానికి నిలయమైన ఆ దేశం విలయానికి చిరునామాగా మారింది. కనివిని ఎరుగని విధంగా భోటేకోషి నది బుధవారం ఉదయం ఉగ్రరూపం దాల్చడంతో ఉత్తర నేపాల్ విలవిల లాడింది. మెరుపు వరద ధాటికి ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపొయ్యాయి. కొన్ని గ్రామాలలో ఒక్కరు కూడా మిగలలేదన్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నదికి ఇరువైపులా ఉన్న చిన్న, చిన్న గ్రామాల్లో ఒక్కరు కూడా మిగల లేదన్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాసువా జిల్లాలోని టిమురే, స్యాఫ్రుబేసి ప్రాంతాలు బురద దిబ్బలుగా మారాయి. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులు నిమిషాల వ్యవధిలో విరుచుకుపడిన వరద ధాటికి నిశ్చేష్టులయ్యారు. పక్కనే ఉన్న తమ ఆప్తుల చేతులు పట్టుకునే సమయం కూడా కొందరికి దక్కలేదు, ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే మృత్యు ప్రవాహం వారిని ముంచెత్తిది. ఆ ప్రవాహ ధాటిని కళ్లారా చూసిన వారు ఏం చేయాలో తోచక ఉన్నచోటనే నిలుచుండిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు పరిగెత్తడానికి ప్రయత్నించినప్పటికీ రెండు అడుగులు కూడా వేయకముందే వరద ముంచెత్తింది. ఈ జల ప్రళయంలో 400 నుండి 500 మంది పర్యాటకులు గల్లంతైనట్లు భావిస్తున్నారు. వారిలో 150 మందికి పైగా భారతీయులు! రాత్రి పది గంటల సమయానికి వందకు పైగా మృత దేహాలను గుర్తించారు. మృతి చెందిన వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ విలయం నేపాలోని మౌళిక వసతులను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. ఇళ్లు, వాహనాలు, వంతెనలు, రహదారులను మింగేసింది విద్యుత్ మౌలిక సదుపాయాలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు, వాణిజ్య కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ మహా విపత్తుతో కుదేలైన నేపాల్‌కు ప్రపంచం నలుమూలల నుంచి సంఘీభావం వెల్లువెత్తుతోం ది. భారత ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్‌లో మాట్లాడారు. కష్ట కాలంలో నేపాల్ ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మరోవైపు ఈ వరద ప్రవాహం బీహార్, ఉత్తరప్రదేశ్‌లపై కూడా పెను ప్రభావం చూపే ప్రమాదముందని అధికారులు హెచ్చరిం చారు. మహారాజ్‌గంజ్, ఖుషీనగర్ జిల్లాల్లో వరదలు వచ్చే వీలుందని , ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. గండక్, నారాయణి నదుల్లో నీటి మట్టాలు పెరుగుతున్నాయి.
ఖాడ్మాండు: హిమాలయ పర్వత ప్రాంతమైన నేపాల్‌లో జల ప్రళయం విధ్వంసం సృష్టించింది. బుధవారం ఉదయం భోటెకోశి నది అనూహ్యంగా ఉప్పొంగింది. కనీవిని ఎరుగని విధంగా వచ్చిన మెరుపు వరదల ధాటికి టిబెట్-నేపాల్ సరిహద్దు ప్రాంతం విలవిల లాడింది. వందలాది మంది మృతి చెందారు. పెద్ద సంఖ్యలో ప్రజల ఆచూకీ తెలియడం లేదు. నేపాల్ పర్యటనకు వచ్చిన పర్యాటకులలో 400 నుండి 500 మంది వరదల్లో గల్లంతైనట్లు సమాచారం. వారిలో 105 మంది భారతీయులు ఉన్నారు. రాత్రి పదిగంటల సమయానికి వంద మృత దేహాలను వెలికి తీశారు. మరణించిన వారి సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. రోడ్లు, వంతెనలు, జల విద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి. వరద ధాటికి భోటెకోశి నదిపై ఉన్న ప్రాజెక్టులు సైతం కొట్టుకుపోయాయి. దీంతో తీవ్రత మరింత పెరిగింది. ఉవ్వెతున్న సాగుతున్న ప్రవాహంలో భవనాలు,వంతెనలు కొట్టుకురావడం కనిపించింది. ఈ పెను విపత్తు నుండి బయట పడిన వారు దీనిని దీనిని సునామిగా అభివర్ణిస్తున్నారు. హిమాలయాల్లో చోటుచేసుకున్న భూకంపమే ఈ పెను విపత్తుకు కారణమని నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఎండల ధాటికి మంచుకొండ కరగడం కూడా దీనికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోడ్లు,వంతెనలు తెగిపోవడంతో సహాయ కార్యక్రమాలు చేపట్టడం అసాధ్యంగా మారింది.

ఎలా జరిగింది..?
ఉదయం ఎనిమిది తొమ్మిది గంటలల మధ్య వరదకు సంబంధించి తొలి హెచ్చరిక వెలువడినట్లు నేపాల్ మీడియా కథనాలు వెల్లడించాయి. టిబెట్ వైపు నుంచి భారీ నీటి ప్రవాహం భోటేకోషి నదిలోకి ఒక్కసారిగా చేరిందన్నది ఈ కథనాల సారాంశం నేపాల్‌లోని రాసువా జిల్లా వైపు వరద దూసుకొస్తోందన్న హెచ్చరికలు కూడా వెలువడ్డాయి. అదే సమయంలో రాసువాలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో పరిస్థితి తీవ్రత అర్ధమైంది. భోటేకోషి నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. టిమురే, స్యాఫ్రుబేసి ప్రాంతాలను ముంచెత్తింది. క్షణాల్లోనే ఇళ్లు, మార్కెట్లు, వాహనాలు, వంతెనలు, రహదారులు వరదలో కొట్టుకుపోయాయి. టిమురేలోని పోలీస్ యూనిట్లు, స్యాఫ్రుబేసి పోలీస్ పోస్టు కూడా దెబ్బతిన్నాయి. ఆ తరువాత మరికొన్ని నిమిషాల్లోనే ప్రవాహం మరింత వేగంగా పెరిగింది. ప్రజలకు, పర్యాటకులకు సురక్షిత ప్రాంతాలకు తరలే అవకాశం కూడా లేకుండా పోయింది. రాసువా–చైనా సరిహద్దు ప్రాంతంలో భద్రతా సిబ్బంది సహా పలువురు గల్లంతయ్యారు. ప్రారంభ దశలోనే 32 మంది నేపాల్ పోలీస్, ఆర్మ్డ్ పోలీస్ సిబ్బంది ఆచూకీ తెలియకుండా పోయింది. ఉదయం 11 గంటల ప్రాంతానికే వరద భోటేకోషి నుంచి దిగువకు ప్రవహిస్తూ నువాకోట్, ధాదింగ్ వైపు విస్తరించినట్లు వార్తలు వచ్చాయి, ఆ తరువాత త్రిశూలీ నది పరివాహక ప్రాంతాల్లో కూడా ప్రమాదం పెరిగింది. వంతెనలు, మార్కెట్లు, రహదారులు కొట్టుకుపొయ్యాయి. తీవ్రంగా దెబ్బతిన్నాయి. మధ్యాహ్నాం 12 గంటల సమయానికి వరద గల్ఛీ ప్రాంతానికి చేరినట్లు నేపాల్ ఫ్లడ్ ఫోర్‌కాస్టింగ్ డివిజన్ తెలిపింది. మరికొన్ని గంటల్లో మగ్లిన్ వైపు వరద వెళ్లే అవకాశం ఉండటంతో త్రిశూలీ నది ఒడ్డున ఉన్న ప్రజలను ఎత్తైన ప్రాంతాలకు తరలించాలని అధికారులు హెచ్చరించారు. మధ్యాహ్నం నుండి సహాయ చర్యలు వేగం పుంజుకున్నాయి. నేపాల్ సైన్యం, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, నేపాల్ పోలీస్ రంగంలోకి దిగాయి. రెండు సైనిక హెలికాప్టర్లను సహాయక చర్యలకు వినియోగించారు. అయితే భారీ వర్షం, పొగమంచు, తెగిపోయిన రహదారులు, కమ్యూనికేషన్ వ్యవస్థల అంతరాయం వల్ల సహాయక చర్యలు తీవ్రంగా కష్టమయ్యాయి. సాయంత్రం ఆరు గంటల సమయానికి 31 మంది మరణించినట్లు బాగ్మతి ప్రావిన్స్ పోలీస్ కార్యాలయం ప్రకటించింది. దాదాపుగా ఇదే సమయంలో దాదాపు 400 మంది పర్యాటకుల ఆచూకీ తెలియడం లేదని నేపాల్ పర్యాటక శాఖ తెలిపింది.
భారతీయులు ఎందరు?
నేపాల్ టూరిజం బోర్డు 384 మంది పర్యాటకులు గల్లంతైనట్లు తొలుత తెలిపింది. వీరిలో వీరిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీలు. విదేశీయుల్లో 105 మంది భారతీయులు ఉన్నట్ట్లు పేర్కొంది. వీరిలో కైలాస్, మానసరోవర్ యాత్రికులు కూడా ఉన్నారు. అయితే, రాత్రి పొద్దు పోయిన తరువాత 400 నుండి 500 మంది పర్యాటకులు గల్లంతైనట్లు టూరిజం బోర్డు తెలిపింది.
సహకరించండి : నేపాల్ విజ్ఞప్తి
ఈ విపత్కర సమయంలో సహాయక చర్యల్లో సహకరించాలని ప్రపంచ దేశాలకు నేపాల్ విజ్ఞప్తి చేసింది. భారత్, చైనాలు ప్రత్యేకంగా దృష్టి సారించాలని నేపాల్ ప్రభుత్వ ప్రతినిధి సస్మిత్ పోఖరెల్ కోరారు. మరోవైపు భారతీయులు పెద్ద సంఖ్యలో గల్లంతయిన నేపథ్యంలో ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం నేపాల్ ప్రభుత్వంతో సంప్రదించిన అనంతరం అక్కడి సహాయక చర్యలను సమన్వయం చేస్తోంది. భారత్, నేపాల్ మధ్య గల 1751 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు పొడవునా తన దళాలను సహస్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బి) అప్రమత్తం చేసింది. ఎస్‌ఎస్‌బికి చెందిన 18 బృందాలు సరిహద్దు ప్రాంతాల్లో సహాయక, పునరావాస కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయి.

బీహార్,యుపి రాష్ట్రాలు అప్రమత్తం
టిబెటన్ హిమాలయాల్లోని భోటెకోశి నది, నేపాల్ గుండా ప్రవహించి సుంకోషిలో కలుస్తుంది. నేపాల్ నుంచి భారత్‌లోకి ప్రవేశించే కోషి నదిని "బీహార్ దుఃఖదాయిని" అని పిలుస్తారు. ఈ నది ఉప్పొంగుతుండటంతో బీహార్‌కు పెను ప్రమాదం పొంచిఉంది. ఈ నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సిఎం సామ్రాట్ చౌదరి సిఎస్, డిజిజిలతో అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు మహారాజ్‌గంజ్, కుషీనగర్ జిల్లాలను హైఅలర్ట్ చేశారు. గండక్, నారాయణి నదుల్లో నీటిమట్టం పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
నేపాల్ ప్రధానికి మోడీ ఫోన్
నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి మాట్లాడారు. జరిగిన ప్రాణ, ఆస్తినష్టం పట్ల విచారం వ్యక్తంచేశారు. ఈ క్లిష్ట సమయంలో భారత్ అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అవసరమైన అన్ని రకాల మానవతా సాయాన్ని అందించేందుకు సిద్ధంగా వున్నామని చెప్పారు.
సహాయక చర్యలకు జిన్‌పింగ్ ఆదేశాలు
టిబెట్‌లోని చైనా-నేపాల్ సరిహద్దు వద్ద గల అనేక గ్రామాలను బురద ప్రవాహం ముంచెత్తిందని, గల్లంతైన వారికి కాపాడేందుకు అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశించారు. చైనా వైపు రసువాగధి క్రాసింగ్ వద్ద ఆరు అంతస్తుల భవంతి పూర్తిగా బురద నీటిలో మునిగి వుండి కనిపిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. కాగా సరిహద్దు క్రాసింగ్ వద్ద బురద ప్రవాహం ముంచెత్తిందని దీనివల్ల పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించవచ్చని టిబెట్‌లో అధికారులు భయాందోళనలు వ్యక్తం చేశారు.







కామెంట్‌లు (0)