విశాఖపట్నం : నూతన సాంకేతికతలకు అనుగుణంగా సంస్కరణలు వస్తున్నాయని సిఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం విశాఖలో కొనసాగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు కార్యక్రమంలో పలు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సిఎం సమక్షంలో రూ.1.14 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులపై ఆయా సంస్థలు 12 ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. సిఆర్డిఎ, మారిటైమ్ బోర్డు, ఐటీ ఎలక్ట్రానిక్స్, పీ4, హిందాల్కోకు సంబంధించిన ఒప్పందాలు వీటిలో ఉన్నాయి. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ .... సమర్థ, సుస్థిర నాయకత్వం ఉంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేస్తే వాళ్లే మనల్ని ఆశీర్వదిస్తారు అని చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వస్తున్నారంటే వాళ్లలో నమ్మకం ఏర్పడిందన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని తెలిపారు. కుటుంబానికే పరిమితం కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడాలన్నారు. సమాజమే మన కుటుంబం.. అందరూ బాగుంటేనే మనమూ బాగుంటాం అని చెప్పారు. ప్రకాశం జిల్లా కందుకూరులో మైనింగ్ కార్యకలాపాలకు హిందాల్కో గ్రూప్‌తో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుందన్నారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు హిందాల్కో ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ పెట్టుబడితో 2,500 మందికి ఉపాధి లభించనుందన్నారు. తిరుపతి జిల్లాలో ఆర్బిటాల్ డేటా సెంటర్, రాకెట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఒప్పందం జరిగిందని వివరించారు.
నూతన సాంకేతికతలకు అనుగుణంగా సంస్కరణలు : సిఎం చంద్రబాబు
10 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 13, 2026, 12:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)