అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్దమైంది. మూడు దశల్లో జరిగే ఈ ఎన్నికల షెడ్యూల్ ను నిన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. దీని ప్రకారం నేడు (శుక్రవారం) రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఆఫర్ ను ప్రకటించబోతోంది. రాష్ట్రంలో పంచాయతీల ఎన్నికల అవసరం లేకుండా ఏకగ్రీవం చేసుకుంటే గరిష్టంగా రూ.50 లక్షల వరకూ నజరానా ఇస్తామని చెబుతోంది. ఈరోజు దీనిపై ఉత్తర్వులు ఇవ్వనుంది.
రాష్ట్రంలో ఎన్నికలు లేకుండా ముందుగానే ఏకగ్రీవం చేసుకునే పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహకాల్ని ప్రభుత్వం ఈసారి భారీగా పెంచింది. కనిష్టంగా రూ.15 లక్షలు, గరిష్టంగా రూ.50 లక్షల వరకూ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించబోతోంది. ఇప్పటివరకూ ఉన్న నాలుగు కేటగిరీల్ని మూడుకు తగ్గించి ఈ ప్రోత్సాహకాలను అందించనుంది. ఇందులో కేటగిరీల వారీగా రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల మొత్తం ఆయా పంచాయతీలకు నజరానాగా అందించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం .... 5 వేల లోపు జనాభా ఉండే గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే రూ.15 లక్షలు నజరానాగా అందిస్తారు. 5001 నుంచి 10 వేల లోపు జనాభా ఉండే పంచాయతీలకు ఏకగ్రీవమైతే రూ.25 లక్షలు ఇస్తారు. అలాగే 10 వేలకు మించిన జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవం చేసుకుంటే వాటికి రూ.50 లక్షలు ప్రోత్సాహకంగా అందిస్తారు. గతంలో ఈ మొత్తాలు నాలుగు కేటగిరీల్లో ఉండేవి. 2 వేల లోపు జనాభా ఉంటే రూ.5 లక్షలు, 5 వేల లోపు జనాభా ఉంటే రూ. 10 లక్షలు, 10 వేల లోపు జనాభా ఉంటే రూ. 15 లక్షలు, 10 వేలకు పైగా జనాభా ఉంటే రూ.20 లక్షలు ఇచ్చే వారు. ఇప్పుడు ఈ మొత్తాల్ని గరిష్టంగా రూ. 50 లక్షలకు పెంచడంతోపాటు కేటగిరీలను సైతం తగ్గించారు. ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీల్ని ఏకగ్రీవం చేసుకునేందుకు భారీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అభ్యర్ధుల మధ్యే కోటి-కోటిన్నర రూపాయల వరకూ బేరాలు నడుస్తున్నాయి. దీనికి అదనంగా ప్రభుత్వ నజరానా కూడా వాటికి జతయ్యింది.







కామెంట్లు (0)