పుట్టల వద్ద ప్రత్యేక పూజలతో మొక్కులు తీర్చుకున్న మహిళలు
టపాసుల కాల్పులు, బాలల కేరింతలతో సందడి..
ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : దీపావళి పండుగ అనంతరం వచ్చే పవిత్రమైన నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆలమూరు మండల పరిధి వ్యాప్తంగా మహిళలు తమ కుటుంబ సభ్యులతో కలసి అత్యంత భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే గ్రామీణ ప్రాంతాల్లో పండుగ సందడి నెలకొంది. మహిళలు, చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా వారంతా సమీపంలోని పొలాలు, తోటలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న నాగుపాముల పుట్టల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా మండలంలోని చెముడులంక శ్రీ విజయ దుర్గ చంటి బిడ్డల తల్లి అమ్మవారు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్ల దివ్య క్షేత్రంలో సంతాన నాగమ్మ తల్లి వద్ద మహిళలు, అయ్యప్ప మాలధారణాలు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కుబడులు చెల్లించుకుని నాగమ్మ తల్లి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు పుట్టల వద్ద దీపారాధనలు చేసి నాగదేవతకు పాలు, గుడ్లు, తేగలు, బుర్రగుంజు, చలివిడి తదితర నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, సంతానం అభివృద్ధి చెందాలని నాగదేవతను భక్తితో ప్రార్థించారు. అలాగే వివిధ రకాల టపాసుల కాల్పులతో కుటుంబ సభ్యులతో కలిసి పుట్టల వద్దకు చేరుకున్న బాలబాలికలు కేరింతల నడుమ, పండుగ వాతావరణంలో ఉత్సాహంగా గడిపారు. అయితే, ఇటీవల కాలంలో పట్టణీకరణ, వ్యవసాయ భూముల విస్తరణ తదితర కారణాలతో సహజసిద్ధమైన పుట్టలు కనుమరుగవుతుండటంతో పూజల కోసం పుట్టలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీంతో వివిధ ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన కృత్రిమ పుట్టల్లో మ్రొక్కులు తీర్చుకోవాల్చి వస్తుందని పలువురు పేర్కొన్నారు.






కామెంట్లు (0)