- ‘సిఐఐ’ సన్నాహక చర్యలో భాగంగా నిర్వహించాలి
- సమీక్షలో సిఎం ఆదేశం
- అక్టోబర్ 7 నుండి 26వ తేది వరకు నిర్వహించాలని నిర్ణయం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి: నవంబర్ నెలలో నిర్వహించే భాగస్వామ్య సదస్సు సన్నాహకాల్లో భాగంగా రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో ఐదు ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖలో నవంబర్ 12, 13 తేదీల్లో నిర్వహించనున్న 31వ సిఐఐ పార్టనర్షిప్ సమ్మిట్-2026కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సన్నాహక కార్యక్రమాలపై గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో ఈ సదస్సులు నిర్వహించి పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షించాలని, ప్రాజెక్టులకు ఎంఓయూలు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు, పెట్టుబడి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని చర్చలు నిర్వహించాలన్నారు.
భాగస్వామ్య సదస్సు కేవలం ఎంఓయూల కోసం కాకుండా... ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినింపేలా ఉండాలన్నారు.
ఈ సందర్భంగా ప్రస్తుత పెట్టుబడుల స్థితిగతులను ముఖ్యమంత్రి పరిశీలించారు. అక్టోబర్ చివరి నాటికి పెట్టుబడి ప్రతిపాదనల్లో 75 శాతం గ్రౌండింగ్ చేసే లక్ష్యంతో శాఖలు పనిచేయాలని నిర్దేశించారు. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.22.57 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 714 ప్రాజెక్టులకు ఎంఓయూలు కుదిరాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వాటిల్లో ఇప్పటికే 247 ప్రాజెక్టులు గ్రౌండింగ్ జరిగినట్టు తెలిపారు. ఎంవోయూలు చేసుకుంటే సరిపోదని, అవి గ్రౌండ్ అయ్యేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు.
రీజినల్ కాన్ఫరెన్స్‌ల షెడ్యూల్
అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 26 వరకు రీజినల్ కాన్ఫరెన్సులు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. విశాఖపట్నంలో అక్టోబర్ 7న ఏఐ, డేటా సెంటర్లు, ఐటీ – ఫిన్ టెక్, సెమికండక్టర్స్, జీసీసీ, ఫార్మా, మెడ్ టెక్ ఫోకస్‌గా కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. అక్టోబర్ 12న కాకినాడలో మారిటైమ్, షిప్ బిల్డింగ్, కెమికల్స్, గ్రీన్ హైడ్రోజన్, అమోనియా, ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలకు ప్రయార్టీ ఇవ్వనున్నారు. ఇక అక్టోబర్ 16న గుంటూరులో గవర్నెన్స్, క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్, అర్బన్ ఇన్ఫ్రా, క్వాంటం వ్యాలీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పైన... అ23న అనంతపురంలో ఏరో స్పేస్, డెఫెన్స్, ఆటోమోటివ్, నేచురల్ ఫార్మింగ్, హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, రిన్యువబుల్ ఎనర్జీ.... అక్టోబర్ 26న తిరుపతిలో టూరిజం, హాస్పటాలిటీ, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చ రింగ్, సెమి కండక్టర్, అడ్వాన్డ్స్ మెటీరియల్స్, ఆటోమోటివ్, స్పేస్, ఫుట్ వేర్ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ రీజినల్ కాన్ఫరెన్సులు నిర్వహించ నున్నారు. రీజినల్ సదస్సుల్లోనే ఎంఓయూలు చేసుకునేలా ఈసారి మార్పులు చేశారు.
దేశీయ, అంతర్జాతీయ రోడ్‌షోలు
సిఐఐ భాగస్వామ్య సదస్సు-2026కు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జా తీయ ప్రతినిధులను ఆకర్షించేందుకు ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ రోడ్‌షోలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు. దేశీయంగా చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించగా, సెప్టెంబర్ 25న అహ్మదాబాద్, సెప్టెంబర్ 28న హైదరాబాద్, సెప్టెంబర్ 30న ముంబైలో రోడ్‌షోలు నిర్వహించనున్నట్టు వివరించారు. అంతర్జాతీయంగా సింగపూర్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, తైవాన్‌లలో రోడ్‌షోలు పూర్తయ్యాయని, సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ ఒకటి మధ్య స్వీడన్‌లో, అక్టోబర్ 13–14 తేదీల్లో జపాన్‌లో, అక్టోబర్ 15–16 తేదీల్లో చైనాలో రోడ్‌షోలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇప్పటికే 11 దేశాల మంత్రులు, 26 దేశాల స్పీకర్లు, 21 దేశాల ప్రతినిధులు భాగస్వామ్య సదస్సుకు ఖరారయ్యారని చెప్పారు. సింగపూర్, కంబోడియా, మయన్మార్, స్లోవాక్ రిపబ్లిక్, లిథువేనియా, బల్గేరియా, మారిషస్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గ్వాటెమాలా, మొజాంబిక్ తదితర దేశాల నుంచి మంత్రులు, ప్రతినిధులు ఈసారి హాజరవుతున్నారని వివరించారు. సమ్మిట్‌కు ముందు అక్టోబర్ 8న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. దౌత్యవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు, మీడియా సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుందన్నారు.








కామెంట్‌లు (0)