రెండు వారాలుగా సముద్రంలోనే ఏడుగురు మత్స్యకారులు.. కన్నీళ్లతో ఎదురుచూస్తున్న కుటుంబాలు
మెరైన్, కోస్టుగార్డ్ తీవ్ర గాలింపు.. బంగ్లాదేశ్ సహా ఇతర దేశాల్లోనూ ఆరా
ప్రతి ఫోన్ మోగినా తమవారే చేశారేమోనని ఆశగా ఎదురుచూపులు
ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ) : ప్రతిరోజూ లాగానే ఆరోజు కూడా సముద్రంలో చేపల వేటకు వెళ్తున్నామని చెప్పారు. ఇంట్లో భార్యాపిల్లలతో నవ్వుతూ మాట్లాడారు. "మేము వేటకు వెళ్లి తిరిగి వచ్చేస్తాం.. ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండండి. బాబుకు ఏమైనా కావాల్సినవి ఉంటే మేము తిరిగి వచ్చిన తర్వాత కొనుక్కుందాం" అంటూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వెళ్లారు. కానీ అలా వెళ్లిన వారు తిరిగి వస్తారో లేదో తెలియని పరిస్థితి ఆ కుటుంబాల్లో నెలకొంది. రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ లేకపోవడంతో ప్రతి క్షణం యుగంలా మారింది. ఇంటి గడప దాటిన తమవారు మళ్లీ ఎప్పుడు వస్తారోనని ఎదురుచూస్తూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఉప్పాడ కొత్తపల్లి మండలం సుబ్బంపేట గ్రామానికి చెందిన గరికిన సింహాద్రి, సూరాడ కోదండ, కందాల రాము, సూరాడ చిన్న, గంపల ప్రకాశ్, తిర్రి నారాయణ, మేరుగు నారాయణ ఈ నెల 9వ తేదీన చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. వేటకు వెళ్లిన తొలి నాలుగు రోజుల పాటు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. తాము క్షేమంగానే ఉన్నామని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ నెల 14వ తేదీ నుంచి వారి నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాకపోవడంతో ఆందోళన మొదలైంది. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా సిగ్నల్స్ అందకపోవడంతో ఏం జరిగిందో తెలియక తల్లడిల్లిపోతున్నారు.
నెలకు సరిపడా ఆహారం.. 1500 లీటర్ల డీజిల్ !
బంధువులు తెలిపిన వివరాల ప్రకారం బోటులో సుమారు 1500 లీటర్ల డీజిల్‌తో పాటు 30 రోజులకు సరిపడా ఆహారాన్ని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో వారు ఎక్కడో ఒకచోట సురక్షితంగా ఉండి తిరిగి వస్తారనే ఆశతో కుటుంబ సభ్యులు రోజులు లెక్కపెడుతున్నారు. కానీ రెండు వారాలు దాటుతున్నా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆ ఆశలు ఆందోళనగా మారుతున్నాయి.
ప్రతి ఫోన్ మోగినా.. నాన్నే చేశాడేమో !
ఇంట్లో ఫోన్ మోగితే చాలు.. సముద్రంలో వేటకు వెళ్లిన తమవారే ఫోన్ చేశారేమోనని కుటుంబ సభ్యులు పరుగులు తీస్తున్నారు. ప్రతి కాల్‌లోనూ వారి గొంతు వినిపిస్తుందేమోనని ఆశగా ఫోన్ అందుకుంటున్నారు. కానీ అవతలి వైపు వినిపించే స్వరం మరొకరిదై ఉండటంతో మళ్లీ నిరాశే ఎదురవుతోంది. నిన్న వస్తారేమో.. ఈరోజైనా వస్తారేమోనంటూ గడుపుతున్న కుటుంబాలకు కాలమే కదలడం లేదు.
నాన్న వస్తాడు.. ఏడవకురా బాబూ !
చిన్నారుల పరిస్థితి మరింత హృదయవిదారకంగా ఉంది. నాన్న ఎక్కడికి వెళ్లాడు? ఎప్పుడు వస్తాడు? అంటూ పిల్లలు అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక తల్లులు కన్నీళ్లు దిగమింగుకుంటున్నారు. "ఏడవకురా బాబూ.. నాన్న వస్తాడు" అంటూ పిల్లలను ఓదారుస్తున్నా వారి కళ్లలో మాత్రం కన్నీళ్లు ఆగడం లేదు. ఒకవైపు పిల్లలకు ధైర్యం చెప్పాలి.. మరోవైపు భర్త క్షేమంగా తిరిగి వస్తాడనే నమ్మకంతో ఎదురుచూడాలి. ఈ రెండు బాధల మధ్య ఆ తల్లుల వేదన వర్ణనాతీతంగా మారింది.
*నాకు ఆయనే దిక్కు..
భర్తే జీవనాధారంగా బతుకుతున్న మహిళలకు ఈ గల్లంతు వార్త గుండెల్లో గుబులు రేపుతోంది. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి కనిపించకుండా పోవడంతో భవిష్యత్తు ఏమిటో తెలియని అయోమయంలో ఉన్నారు. చిన్నపిల్లల భవిష్యత్తు, కుటుంబ పోషణ, రోజువారీ జీవనం అన్నీ కళ్లముందు ప్రశ్నలుగా నిలుస్తున్నాయి. భర్త తిరిగి వస్తాడనే ఒక్క ఆశతో రోజులు గడుపుతున్నారు.
సముద్రంలో మెరైన్, కోస్టుగార్డ్ గాలింపు.. విదేశాల్లోనూ ఆరా !
గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం మెరైన్ పోలీసులు, కోస్టుగార్డ్ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. సముద్ర జలాల్లో విస్తృతంగా అన్వేషణ కొనసాగిస్తున్నారు. బోటు సముద్ర ప్రవాహాల కారణంగా ఇతర దేశాల సముద్ర జలాల్లోకి వెళ్లి ఉండవచ్చనే కోణంలోనూ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో పాటు ఇతర దేశాల్లోనూ మత్స్యకారుల ఆచూకీ లభిస్తుందా అనే దిశగా విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో వివరాలు సేకరించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది.
అయితే అధికారుల గాలింపు కొనసాగుతున్నప్పటికీ తమవారి నుంచి ఒక్క సమాచారం కూడా అందకపోవడంతో బాధిత కుటుంబాల్లో ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. అధికారులు ఎక్కడ వెతుకుతున్నారు? ఏదైనా సమాచారం వచ్చిందా? అనే ఆశతో ప్రతి క్షణం ఎదురుచూస్తున్నారు.
సుబ్బంపేటలో అలుముకున్న విషాద ఛాయలు
ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతవడంతో సుబ్బంపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎక్కడ చూసినా వారి గురించే చర్చ. బాధిత కుటుంబాల ఇళ్లకు బంధువులు, గ్రామస్థులు వచ్చి పరామర్శిస్తున్నా వారి కన్నీళ్లను ఆపడం ఎవరి వల్లా కావడం లేదు. సముద్రంలోకి వెళ్లిన తమవారు క్షేమంగా తిరిగి రావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు.వేటకు వెళ్లేటప్పుడు నవ్వుతూ వీడ్కోలు చెప్పిన ఆ ముఖాలు మళ్లీ ఎప్పుడు కనిపిస్తాయోనని కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఆ ఇంటి గడపలు మాత్రం తమవారి రాక కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి. పిల్లల ప్రశ్నలకు సమాధానం లేదు.. భార్యల కన్నీళ్లకు అంతం లేదు.. తల్లిదండ్రుల ఎదురుచూపులకు విరామం లేదు.వారి కోసం ఎదురుచూస్తున్నది కేవలం ఏడు కుటుంబాలే కాదు.. యావత్ సుబ్బంపేట గ్రామం ! ఎదురుచూస్తుంది.







కామెంట్‌లు (0)