సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారుల కోసం కోస్ట్‌గార్డ్, నేవీ విస్తృత గాలింపు
యుద్ధ నౌకలు, హెలికాప్టర్లతో నిరంతరంగా గాలింపు చర్యలు
బంగ్లాదేశ్, మయన్మార్ నేవీ అధికారులకు సమాచారం : జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామం సుబ్బంపేట గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతవడంతో వారి ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్, నేవీ అధికారులు సంయుక్తంగా విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. యుద్ధ నౌకలు, హెలికాప్టర్లను వినియోగిస్తూ సముద్రంలో నిరంతరాయంగా గాలింపు కొనసాగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ నెల 19వ తేదీ సాయంత్రం ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందిందని తెలిపారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు కోస్ట్‌గార్డ్‌కు సమాచారం అందించి గాలింపు చర్యలకు శ్రీకారం చుట్టారు. కోస్ట్‌గార్డ్ టోల్ ఫ్రీ నంబర్‌కు అందిన సమాచారం ప్రకారం .. గల్లంతైన మత్స్యకారులు ఈ నెల 18వ తేదీన ఒడిశాలోని పారాదీప్ పోర్టు సమీపంలో కనిపించినట్లు ప్రాథమికంగా గుర్తించారని పేర్కొన్నారు. ఆ తర్వాత వారి నుంచి ఫోన్ లేదా ట్రాన్స్‌పాండర్ ద్వారా ఎలాంటి సమాచారం అందలేదని వివరించారు. కాకినాడ కోస్ట్‌గార్డ్ అధికారులు తక్షణమే స్పందించి గాలింపు చర్యలను ముమ్మరం చేయడంతో పాటు ఒడిశా, చెన్నై కోస్ట్‌గార్డ్ కేంద్రాలకు సమాచారం అందించారు. వివిధ విభాగాల మధ్య సమన్వయం ఏర్పాటు చేసి గాలింపు కార్యక్రమాన్ని విస్తృతం చేశారు. అంతర్జాతీయ స్థాయిలోనూ గాలింపు చర్యలకు సహకారం అందేలా బంగ్లాదేశ్, మయన్మార్ నేవీ అధికారులతో ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. మత్స్యకారుల చివరి కదలికలను గుర్తించడం, వారికి సంబంధించిన మరిన్ని వివరాలను సేకరించడం, అందుబాటులో ఉన్న నిఘా, సమాచార వ్యవస్థల ద్వారా వారి ఆచూకీని కనుగొనేందుకు అధికారులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా తిరిగి వస్తారనే ఆశాభావాన్ని కలెక్టర్ వ్యక్తం చేశారు. వారి ఆచూకీ లభించే వరకు కోస్ట్‌గార్డ్, నేవీతో పాటు సంబంధిత శాఖల సమన్వయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.






కామెంట్‌లు (0)