బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రైతు ఉద్యమం @ఆరేళ్లు - రేపు దేశవ్యాప్తంగా నిరసనలు

28 నిమిషాల క్రితం

aiks
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 03:33 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: రైతుల ఉద్యమం ఆరవ వార్షికోత్సవం సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్.కె.ఎం) ఆధ్వర్యంలో రేపు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఢిల్లీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి సమర్పించేందుకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సిద్ధం చేశారు. ఢిల్లీలో రేపు తెల్లవారుజామున 1 గంటకు మందిర్ మార్గ్ నుంచి రైతుల యాత్ర ప్రారంభమై జంతర్ మంతర్ వద్ద ముగియనుంది. అనంతరం రాష్ట్రపతికి వినతిపత్రం అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాలకు చెందిన రైతులు పాల్గొననున్నారు. హర్యానా రైతులు బహదూర్‌గఢ్‌లో సమావేశమై టిక్రీ సరిహద్దు వరకు పాదయాత్ర చేయనున్నారు. దేశవ్యాప్తంగా 100 కేంద్రాల్లో నిరసనలు నిర్వహించి, జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రాలు అందజేయనున్నారు.

దేశంలో పెరుగుతున్న వ్యవసాయ సంక్షోభాన్ని వివరిస్తూ ప్రత్యేక నివేదికను కూడా వినతిపత్రానికి జతచేశారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ కార్మికులు ఈ ఆందోళనలో పాల్గొనాలని ఎస్‌కేఎం నాయకులు పిలుపునిచ్చారు. కార్మిక సంఘాలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు.

కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజయ్ కృష్ణన్, సంయుక్త కార్యదర్శి పి. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. 2021 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించాలని కోరారు. ప్రభుత్వ రంగంలో పంటలు, పశువుల బీమా సంస్థను ఏర్పాటు చేయాలని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రద్దు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ డిసెంబర్ 1న సీఐటీయూ ఆధ్వర్యంలో పార్లమెంట్ మార్చ్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఢిల్లీ నుంచి వివిధ రంగాలకు చెందిన 50 వేల మంది మహిళా కార్మికులు ఈ మార్చ్‌కు నాయకత్వం వహించనున్నారు. కార్మిక చట్టాలను ఉపసంహరించాలని, కనీస వేతనాలను నిర్ధారించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ మార్చ్ అనంతరం రామ్‌లీలా మైదాన్‌లో మూడు రోజుల పాటు నిరంతర నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్