మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

7 నెలల్లో రీసర్వే పూర్తి

16 గంటల క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 12:24 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- భూ రికార్డుల ప్రక్షాళనకే రెవెన్యూ సంస్కరణలు

- పాస్ పుస్తకాలకు టెక్నాలజీ రక్షణ కవచం

- పొగాకు రైతులకు బ్యారెన్ కు రూ.50 వేల రుణం

- ‘మీ భూమి-మీ హక్కు’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రజాశక్తి-ఏలూరు ప్రతినిధి : రాబోయే ఏడు నెలల్లో 9,365 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి 68.64 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తామని, ఇప్పటికే 32.32 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను భూ యజమానులకు అందజేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పొగాకు రైతులకు బ్యారెన్ కు రూ.50 వేల రుణం బ్యాంకులు ఇచ్చేలా కేంద్రంతో మాట్లాడుతానన్నారు. ఏలూరు జిల్లా కలిదిండిలో ‘మీ భూమి-మీ హక్కు’ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్ర మానికి ఆయన హాజరయ్యారు. హెలికాప్టర్లో కలిదిండి చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా తహశీల్దార్‌ ‌కార్యాలయంలో రైతులు, మాజీ సైనికులతో ముఖాముఖి నిర్వహించారు. పలు గ్రామాల్లోని 830 కుటుంబాలకు చెందిన 2,475 ఎకరాలను 22 `ఎ` జాబితా నుంచి తొలగించి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాలని కలెక్టర్‌‌ను ఆదేశించారు. అనంతరం ప్రజావేదిక వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం సభలో నల్లజర్ల దుర్గా భవానీ అనే మహిళా రైతుకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాన్ని అందించారు. రీసర్వే ప్రక్రియకు సంబంధించి కలిదిండిలో నిర్వహించిన గ్రామసభకు హాజరైనట్టుగా రిజిస్టర్‌లో ముఖ్యమంత్రి సంతకం చేశారు. అనంతరం సిఎం మాట్లాడుతూ భూ రికార్డుల ప్రక్షాళనకే రెవెన్యూ రిఫార్మ్స్-2026 తీసుకొచ్చామని తెలిపారు. గత ప్రభుత్వం వారికి ఇష్టం లేని వ్యక్తుల భూములను, ఆస్తులను 22 'ఎ`లో పెట్టేసి వివాదాస్పదం చేసిందన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులకు ఇచ్చిన భూమిని 22 `ఎ`లో పెడితే దానిని పరిష్కరించి వారికి పట్టాలు ఇచ్చామని తెలిపారు. కరెన్సీకి ఉండే పటిష్టమైన భద్రతా ఫీచర్లను పట్టాదారు పాస్ పుస్తకాలకు కూడా అమలు చేస్తున్నామని, క్యూఆర్ కోడ్ సహా ఇతర సాంకేతికపరమైన భద్రతా ఫీచర్లను ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పటి వరకూ 41 వేల ఎకరాల మేర భూ సమస్యలు పరిష్కరించామని, తద్వారా 1.27 లక్షల మందికిపైగా రైతులు, పరిశ్రమలు, ప్రజలకు ప్రయోజనం కలిగిందన్నారు. 1.36 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశామని, వన్‌బి, అడంగల్, డికెటి, ఎఆర్‌‌సి, ఇనామ్, సీలింగ్ వంటి పాత భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ చేపట్టామని తెలిపారు.

కొల్లేరు ప్రాంత గ్రామాలతో పాటు కైకలూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.36 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాల్లో పదేపదే మరమ్మతులు వచ్చే రహదారులకు కూడా శాశ్వత పరిష్కారంలో భాగంగా సిమెంట్ రోడ్లు వేయాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆక్వాకు యూనిట్ కు రూ.1.50 చొప్పున రాయితీ విద్యుత్ ను జోన్ తో నిమిత్తం లేకుండా ఇస్తున్నామని తెలిపారు. నాన్ ఆక్వా జోన్ పరిధిలోని 12,500 మంది రైతులకు కూడా దీనిని అమలు చేస్తున్నామన్నారు.

పరామర్శల పేరుతో జగన్ నానాయాగీ...

పొగాకు రైతుల పరామర్శ పేరుతో దేవరపల్లికి జగన్ వెళ్లి నానాయాగీ చేశారని చంద్రబాబు విమర్శించారు. మెగా డిఎస్సి ద్వారా 15 వేల టీచర్ల పోస్టులు భర్తీ చేస్తే దానిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు రోడ్లపైకి వచ్చి ర్యాలీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కడితే అది నేనే కట్టానని జగన్ అంటున్నారని ఎద్దేవా చేశారు. కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని ప్రసంగం చివర్లో ఆయన ప్రకటించారు. అనంతరం రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. శాఖల వారీగా అధికారుల పనితీరును ఐవిఆర్‌‌ ఎస్‌ ‌కాల్స్‌ ‌ద్వారా వచ్చిన ఫీడ్‌‌బ్యాక్‌ ‌వివరించారు. సభ ముగిసిన తర్వాత టిడిపి, నాయకులు కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొలుసు పార్ధసారథి, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్, సిసిఎల్ఎ జయలక్ష్మి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్