- కంపెనీలతో రహస్య సమావేశం
- డిపోల నుండి గుట్టుచప్పుడు కాకుండా ప్రతిపాదనల స్వీకరణ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఆర్‌టిసిలో విద్యుత్ బస్సులను అదనంగా తీసుకునేందుకు యాజమాన్యం సిద్ధమైంది. ఇప్పటికే 12 డిపోలను ప్రైవేటు సంస్థలకు కేటాయించి 1050 బస్సుల కొనుగోలుకు సిద్ధమైన సంస్థ కొత్తగా మరో 1450 బస్సులు తీసుకుటోంది. మొత్తంగా 2500 బస్సులు తీసుకుంటోంది. దీనిపై విద్యుత్ బస్సు తయారీ సంస్థలతో గురువారం అత్యంత రహస్యంగా ఆర్‌టిసి యాజమాన్యం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి జులై 20 వ తేదీన పంపినట్లు పాత తేదీతో (T1/535/RTC eBuses(01)/2025-OPD-టి) ఆయా కంపెనీలకు లేఖ పంపించారు. మార్చి 18 తేదీన అందిన లేఖ(నెం. TL5/286(10)/2025-MED) ప్రకారం జిసిసి మోడల్ కింద 1450 బస్సులకు టెండర్లు పిలవాలని యాజమాన్యం నిర్ణయించినట్లు తెలిపారు. కొత్తగా తీసుకోబోయే ఛార్జింగు వివరాలకు సంబంధించి జూన్ 19వ తేదీన రెండు లేఖలు (TL5/286(10)/2025-MED), (T1/535/RTC eBuses(01)/2025-OPD-T)ల ద్వారా ఆయా సంస్థల నుండి సమాచారం తీసుకున్నారు. వీటి ఆధారంగానే గురువారం అత్యంత రహస్యంగా సమావేశం నిర్వహించారు. దీనిలో కొత్తగా తీసుకోబోయే బస్సు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకూ నడుస్తుందని, 45 నిమిషాల మధ్యంతర ఛార్జింగ్‌తో మరో 150 కిలోమీటర్లు అంటే 450 కిలోమీటర్ల వరకు నడపవచ్చని పేర్కొన్నారు. ఈ-బస్సులు పూర్తిగా ఛార్జ్ కావడానికి మూడు గంటల సమయం పడుతుందని ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యాను ఫ్యాక్చరర్(ఓఈఎం) పేర్కొందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఓఈఎం వద్ద అందుబాటులో ఉన్న ఈ-బస్సుల స్పెసిఫికేషన్స్ వాటి నిర్వహణ (మొదటి పేజీ తరువాయి) పరిధి, రూట్ల వివరాలను డిపోల వారీగా తెలపాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఆయా జోన్ల అధికారులకు సమాచారం అందించినట్లు సమావేశ రిపోర్టులో ప్రస్తావించారు. దీనికి అనుగుణంగా 1450 ఈ-బస్సుల కోసం 29 డిపోల నుండి ప్రతిపాదనలు వచ్చాయని పేర్కొన్నారు. ఏ డిపోకు ఎన్ని బస్సులు ఇవ్వాలనే అంశంతోపాటు ఆయా సంస్థలు ఎన్ని బస్సులు సరఫరా చేస్తాయనే విషయంపైనా ఆర్‌టిసి ఉన్నతాధికారులు గురువారం ఆయా సంస్థలతో చర్చించారు. త్వరలో దీనిపై ఆర్‌టిసి బోర్డు నిర్ణయం వెల్లడించనుంది.







కామెంట్‌లు (0)