గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆధార్, మీసేవ కేంద్రాల చుట్టూ పింఛను దరఖాస్తుదారుల ప్రదక్షిణలు

19 నిమిషాల క్రితం

pension
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 12:06 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- అప్‌డేషన్ పత్రాలు సకాలంలో అందుతాయనేది సందేహమే

- గడువు ఆరు రోజులే... అందులో 3 సెలవులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి, బూర్జ : కొత్త పింఛను దరఖాస్తుదారులకు అవస్థలు తప్పడం లేదు. దరఖాస్తుతోపాటు పలు రకాల ధ్రువపత్రాలను జత చేయాల్సి రావడంతో వాటిని పొందటానికి నానాపాట్లు పడుతున్నారు. వాటి కోసం మీ సేవ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. దీంతో, మీసేవ కేంద్రాలు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. అయినా, పత్రాలు పొందలేని పరిస్థితి నెలకొంది. చనిపోయిన భర్త పేరును అధికారులు రేషన్ కార్డులో ఇప్పటికీ తొలగించకపోవడంతో వితంతు పింఛను పొందటానికి అవకాశం లేకుండాపోతోంది. మరణ ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించిన తర్వాత వాటిని రేషన్ కార్డు నుంచి తొలగించడానికి నాలుగైదు రోజులు పడుతోందని సిబ్బంది చెప్తున్నారు. ఆధార్ అప్‌డేషన్ హిస్టరీ పత్రాన్ని పొందడానికి గతంలో ఇచ్చిన ఫోన్ నంబర్ కాకుండా కొత్త నెంబర్ ఇవ్వడంతో ఫోన్ ఒటిపి (ఒన్ టైం పాస్ వర్డ్ ) రాక అప్ డేషన్ జరగడం లేదు. ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలకు ఆధార్ లింక్ చేయడంతో ఆధార్ నంబరు నమోదు చేయగానే వేరే సామాజిక తరగతి పేరు రావడం, ఆధార్, కులధ్రువీకరణ పత్రాల్లో పుట్టిన తేదీలు వేర్వేరుగా ఉండటం వంటి పొరపాట్లు తిరస్కరణకు గురవుతున్నాయి. మరణించిన వారి పేర్లు రేషన్ కార్డులో తొలగింపు, ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలను తహశీల్దార్ తన లాగిన్ లో పరిశీలించి వాటిని క్లియర్ చేయాలి. వీటికి కనీసం వారం నుంచి పది రోజుల సమయం పట్టే అవకాశం ఉండటంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తమవు తోంది. పింఛను కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఈ నెల 16 తుది గడువుగా నిర్ణయించడంతో ఇంకా ఆరు రోజులే ఉన్నాయి. పైగా, ఈ నెల 12 నుంచి 14 వరకు వరుసగా సెలవులు వస్తున్నాయి. దీంతో, నిర్ణీత గడువులోపు పత్రాలు పొందడటం సందేహాంగానే కనిపిస్తోంది.


చిరునామా తేడా చూపిస్తోంది

నేను బూర్జ మండలం డొంకలపర్తలో ఉంటున్నాను. రేషన్ కార్డు, ఓటరు కార్డు అన్నీ ఇక్కడ చిరునామాతోనే ఉన్నాయి. ఇక్కడ పనులు లేనప్పుడు కొద్ది నెలలు బతుకుతెరువు కోసం ఛత్తీస్‌‌గఢ్‌‌లోని బిలాయ్ వెళ్లే వాళ్లం. వితంతు పింఛను కోసం దరఖాస్తు పెడుతుంటే ఆధార్ హిస్టరీలో బిలాయ్ అని చూపుతోంది. చిరునామా తేడాతో దరఖాస్తు తీసుకోవడం లేదు. పత్రాలన్నీ సరి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదంటున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి కొద్ది రోజులే ఉండటంతో ఏం చేయాలో తోచడం లేదు.

-ఎన్ని అప్పలనరసమ్మ, డొంకలపర్త


భర్త చనిపోయినా రేషన్ కార్డులో డిలెట్‌ ‌కావడం లేదు

నా భర్త 2024లో చనిపోయినా రేషన్ కార్డులో డిలెట్ కావడం లేదు. రేషన్ కార్డు, హౌస్ హోల్డ్ మ్యాప్ లోనూ డిలీట్ అయితేనే కొత్త పింఛనుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఇందుకోసం ఆధార్ సెంటర్, సచివాలయం చుట్టూ తిరుగుతున్నాను. తొలగింపు ఆప్షన్ రాలేదని సిబ్బంది చెబుతున్నారు. కొంత పింఛను కోసం దరఖాస్తుకు ఎక్కువ రోజులు లేకపోవడంతో ఆందోళనగా ఉంది.

-శాసపు నారాయణమ్మ, లక్కుపురం (శ్రీకాకుళం జిల్లా)

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్