కోర్టుకు ఛార్జిషీటు సమర్పించిన సిట్
ప్రజాశక్తి - ఎస్ఆర్ జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన గా సాయికృష్ణ మిస్సింగ్, లాకప్ డెత్ కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ విజయవాడ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. సిట్ విచారణాధికారి (ఐఒ) సుధాకర్ బాబు స్వయంగా కోర్టుకు హాజరై, కేసు దర్యాప్తు వివరాలు, కీలక సాక్ష్యాధారాలను న్యాయస్థానానికి సమర్పించారు. విజయవాడ కృష్ణలంక పోలీసుల కస్టడీలో ప్రయోగించిన థర్డ్ డిగ్రీ వల్లే సాయికృష్ణ ప్రాణాలు కోల్పోయాడని ఛార్జిషీటులో సిట్ పేర్కొంది. సాయికృష్ణ అదృశ్యంపై అతని తల్లి విజయలక్ష్మి మొదటి నుంచి కృష్ణలంక పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చారు. సాయికృష్ణ చనిపోయిన తర్వాత ఆధారాలు దొరకకుండా శవాన్ని స్వర్గపురి శ్మశాన వాటికలో అర్ధరాత్రి వేళ దహనం చేసినట్లు సిట్ తేల్చింది. ఈ ఘాతుకానికి పాల్పడిన కృష్ణలంక సిఐ నాగరాజుతోపాటు మొత్తం ఏడుగురిని నిందితులుగా చేర్చి ఇప్పటికే అరెస్ట్ చేసింది. పరారీలో ఉండే ఇటీవల లొంగిపోయిన గులివిందల సురేష్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. నిందితుల మొబైల్ లొకేషన్లు, కాల్ డేటా రికార్డులు, డిజిటల్ ఆధారాలు, సంఘటనా స్థలం నుంచి సేకరించిన శాస్త్రీయ ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు, కేసుతో సంబంధం ఉన్న కీలక సాక్షుల నుంచి సేకరించిన వాంగ్మూలాలు కోర్టుకు సుధాకరబాబు సమర్పించారు. కేసులో నిందితులుగా కృష్ణలంక సస్పెండెడ్ సీఐ ఎస్ఎస్ వివి. నాగరాజు, హెడ్ కానిస్టేబుళ్లు అశోక్ కుమార్, జంగం నాని, సిబ అనుచరుడు గులివిందల సురేష్, కానిస్టేబుళ్లు సాంబయ్య, బాబు రావు, ఆర్ఎంపి వైద్యుడు. సుబ్బారావు ఉన్నారు.








కామెంట్‌లు (0)