ప్రతిఘటించిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు అరెస్ట్
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పిఒపి)తో తయారుచేసిన గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని సోమవారం పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు.. ట్యాంక్ బండ్లో పిఒపి తయారీ భారీ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టంచేశారు. ట్యాంక్ బండ్ల పై బారికేడ్లు ఏర్పాటుచేశారు. అయితే, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ సోమవారం ట్యాంక్బండ్పై బారికేడ్లను తొలగించారు. అక్కడ ఉన్న పోలీసులతో వాదనకు దిగారు. అక్కడే నిరసనకు దిగడంతో ట్యాంక్ బండ్ పై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి శశిధర్ పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి గాంధీనగర్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధుల అరెస్ట్ అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. ట్యాంక్బంగ్పై నిమజ్జనానికి ప్రభుత్వం అనుమతించాలని డిమాండ్ చేశారు. కాగా, పిఒపితో తయారుచేసిన భారీ విగ్రహాలను హుస్సేన్సాగర్ (ట్యాంక్ బండ్) లో నిమజ్జనం చేయవద్దని, వాటికోసం ప్రత్యేక సరస్సులను ఏర్పాటు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మేరకు జిహెచ్ఎంసి అధికారులు హైదరాబాద్ నగరంలో ఏర్పాట్లు చేశారు.








కామెంట్‌లు (0)