ప్రజాశక్తి, ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖ నగరంలో తొలిసారిగా విస్తృత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎక్స్‌పో, ఆంధ్రప్రదేశ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్‌పో–2026ను ఈ నెల 25, 26 తేదీల్లో గాదిరాజు ప్యాలెస్‌లో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సోలార్ ఇంటిగ్రేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏపీ శివ) అధ్యక్షుడు బి. విశ్వ ప్రసాద్ తెలిపారు. సోమవారం సీతంపేటలోని ఏపీ శివ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ .... ‘ఫస్ట్ వ్యూ’, ‘సోలార్ క్వార్టర్’ సంస్థలు సంయుక్తంగా ఎక్స్‌పో నిర్వహిస్తున్నాయని, ఏపీ శివను అసోసియేషన్ పార్టనర్‌గా ఎంపిక చేశారని చెప్పారు. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఎక్స్‌పో 26వ తేదీ వరకు కొనసాగుతుందని, విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్ ముఖ్య అతిథిగా, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ గౌరవ అతిథిగా హాజరవుతారని తెలిపారు. సుమారు 100 మంది ఎగ్జిబిటర్లు 100 స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారని, 5 వేల నుంచి 10 వేల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉందన్నారు. సోలార్ మాడ్యూల్స్, ఇన్వర్టర్లు, కేబుల్స్, బ్యాటరీలు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (బీఈఎస్ఎస్), ఇతర ఆధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం, సేవలను ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నట్లు చెప్పారు. పీఎం సూర్య ఘర్ పథకం నేపథ్యంలో సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగం, నిల్వ, ఆధునిక సాంకేతికతపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఎక్స్‌పో ప్రధాన ఉద్దేశమన్నారు. ఏపీ శివ అడ్వైజర్ కమ్ కోర్ కమిటీ సభ్యుడు ఎస్.వి. రావు మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతిక శిక్షణ, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన ఈఈఈ, ఈసీఈ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నామని, హాజరయ్యే విద్యార్థులకు ఏపీ శివ తరఫున సర్టిఫికెట్లు అందజేస్తామని చెప్పారు. తయారీదారులు, డీలర్లు, వెండర్లు, ఇన్‌స్టాలర్లు, సాంకేతిక నిపుణులకు కూడా ఎక్స్‌పో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ రెన్యూవబుల్ ఎనర్జీ పథకాలు, సబ్సిడీలు, సాంకేతిక ప్రమాణాలు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతోపాటు కొత్త వ్యాపార అవకాశాలపై సమాచారం పొందవచ్చన్నారు. సమావేశంలో ఏపీ శివ అడ్వైజర్ కమ్ కోర్ కమిటీ సభ్యుడు కే. గోపాల్ రెడ్డి, కోశాధికారి పీటీవీఆర్ కృష్ణారావు పాల్గొన్నారు.
ఈ నెల 25, 26 విశాఖలో సోలార్–రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్‌పో-2026
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 11:48 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)