వాషింగ్టన్ : వైట్‌హౌస్ నుంచి మూడు ప్రముఖ వార్తా సంస్థలను నిషేధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలోని ప్రముఖ టెలివిజన్ నెట్‌వర్క్‌లు సోమవారం నిరసనకు దిగాయి. ఇందులో భాగంగా వైట్‌హౌస్ ‘టీవీ పూల్’ కవరేజీని నిలిపివేస్తున్నట్లు ఎబిసి, సిబిఎస్, సిఎన్‌ఎన్, ఫాక్స్, ఎన్‌బిసి సంస్థలు ప్రకటించాయి. దీంతో ట్రంప్‌కు సంబంధించిన కొన్ని కార్యక్రమాల ప్రత్యక్ష టెలివిజన్ కవరేజీకి అంతరాయం ఏర్పడింది. గతవారం ట్రంప్ సిఎన్‌ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో మీడియా సంస్థలను వైట్‌హౌస్ నుంచి నిషేధించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆ మూడు సంస్థలు కోర్టును ఆశ్రయించాయి.
వైట్‌హౌస్ ‘పూల్’ కవరేజీలో ఒక వార్తా సంస్థ ఆ రోజు జరిగే కార్యక్రమాలను చిత్రీకరించి, ఆ దృశ్యాలను ఇతర టెలివిజన్ సంస్థలకు అందిస్తుంది. సోమవారం వైట్‌హౌస్ టీవీ పూల్ బాధ్యతలను సిఎన్‌ఎన్ నిర్వహించాల్సి ఉంది. అయితే సిఎన్‌ఎన్‌కు సంఘీభావంగా మిగిలిన ప్రధాన టెలివిజన్ నెట్‌వర్క్‌లు కూడా పూల్ కవరేజీ నుంచి తప్పుకున్నాయి. ప్రభుత్వం గురించి ప్రజలకు ఖచ్చితమైన, స్వతంత్ర సమాచారాన్ని పొందే హక్కు ఉందని, వార్తా సంస్థల కథనాలపై అభ్యంతరాలు ఉన్నాయనే కారణంతో ఏ ప్రభుత్వ యంత్రాంగం కూడా వాటి కార్యకలాపాలను నియంత్రించకూడదని ఎబిసి, సిబిఎస్, సిఎన్‌ఎన్, ఫాక్స్, ఎన్‌బిసిలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ నిరసన కారణంగా న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు సోమవారం ట్రంప్ చేసిన పర్యటనకు సంబంధించిన టెలివిజన్ పూల్ కవరేజీ నిలిచిపోయింది. అక్కడ ట్రంప్ పలువురు విదేశీ నేతలతో సమావేశం కావాల్సి ఉంది.








కామెంట్‌లు (0)